ఆర్జేడీ ఆఫీస్ అద్దె 333 రూపాయలే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ కార్యాలయం అద్దె ఎంత ఉంటుంది? వేలల్లో, లక్షల్లో అని అంటారా? ఆర్జేడీ కార్యాలయం విషయంలో మాత్రం కాదు. అవును, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆ పార్టీ హస్తినలో నిర్వహిస్తున్న ఓ డబుల్ సూట్ కార్యాలయం అద్దె నెలకు అక్షరాలా 333 రూపాయలే. వీపీ హౌస్ నంబర్ 13లో ఈ ఆఫీసు ఉంది. దీన్ని 2001 జూన్ నుంచి ఆర్జేడీకి ప్రభుత్వం అద్దెకిచ్చింది. ఆర్జేడీకి ఢిల్లీలోని ఖరీదైన ఐటీవో ప్రాంతంలో మూడంతస్తుల ప్రధాన కార్యాయం ఉన్నప్పటికీ వీపీ హౌస్‌లోని కార్యాలయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. సుభాష్ అగర్వాల్ అనే ఆర్టీఐ కార్యకర్త చేసుకున్న దరఖాస్తుకు పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు ఉన్నాయి.