గోప్యతపై మాజీ అటార్నీ జనరల్ ఏమన్నారంటే...
సాక్షి, న్యూఢిల్లీ : గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిణించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఎదుట తాను వ్యతిరేకించానని మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చెప్పారు. గోప్యత ప్రాథమిక హక్కు కాదని, అది సాధారణ హక్కు మాత్రమేనని ప్రభుత్వం కోర్టులో వాదించిందని ఈ ఏడాది జూన్ వరకూ సుప్రీంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన రోహత్గి తెలిపారు. గతంలో గోప్యత అంశంపై భిన్నతీర్పులు వచ్చిన ఉదంతాన్ని ప్రస్తావించి దీనిపై రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించేలా సుప్రీం కోర్టును రోహత్గి ఒప్పించారు.
జులైలో గోప్యత అంశాన్ని విచారించేందుకు సుప్రీం తొమ్మిది మంది న్యాయవాదులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసే సమయానికి ఆయన అటార్నీ జనరల్ పదవి నుంచి వైదొలిగారు. 2015 నుంచి రోహత్గి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ గోప్యత ప్రాథమిక హక్కు కాదని నొక్కిచెబుతూ వచ్చారు.
భారత రాజ్యాంగంలో అసలు గోప్యత అనే భావన లేదన్న విషయాన్నితాను మొదటినుంచి చెబుతున్నానన్నారు. అయితే ప్రభుత్వం తర్వాత తన వైఖరి మార్చుకుని గోప్యత కొంతమేరకు హక్కుగా పరిగణించవచ్చని కోర్టు ముందు అంగీకరించిందని చెప్పారు. ఇక గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడాన్ని పలువురు స్వాగతించారు.