
ఐటీలో ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’!
- అధికారులకు సోదాలతోపాటు జప్తు చేసే అధికారం
- విస్తృతాధికారాలపై విపక్షాల మండిపాటు
- ఐటీ శాఖను బలోపేతం చేసేందుకేనన్న కేంద్రం
- దుర్వినియోగం కావొచ్చన్న ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలికి తీసేందుకు కఠినమైన నిబంధనలు తీసుకొస్తున్న కేంద్రం నిర్ణయంతో మరిన్ని సమస్యలు తప్పవని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక బిల్లు 2017కు 40 సవరణలు చేసిన కేంద్రం.. దీన్ని పార్లమెంటులో ద్రవ్యబిల్లుగా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. వీటిలో ఆదాయపు పన్ను వసూలు విషయంలో ఐటీ అధికారులకు విస్తృతమైన అధికారాలు కట్టబెట్టింది. దీని ద్వారా ఆదాయపు పన్ను అధికారి.. ఐటీ దాడులు నిర్వహించేందుకు ఎలాంటి కారణం, సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరిపై ఎందుకు దాడులు జరపాల్సి వచ్చిందో ఐటీ శాఖ ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పనిలేదు.
ఐటీ దాడికి సంబంధించిన సమాచారం రహస్యంగా ఉండటం ద్వారా అక్రమాదాయం గురించి సమాచారం ఇచ్చిన ప్రజావేగులను కాపాడవచ్చని కేంద్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. అయితే ఇది దుర్వినియోగం అవుతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు వేద్ జైన్ తెలిపారు. అటు కేంద్రం తీసుకొచ్చిన సవరణలు రాజకీయం అవుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో మళ్లీ ‘ఇన్‌స్పెక్టర్ రాజ్యం’ అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ఎంపీ అంబికా సోనీ మండిపడ్డారు. అధికారులకు అపరిమిత అధికారాలు కల్పించటం ద్వారా అవినీతి పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందని.. ఇన్‌స్పెక్టర్లు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారని ఎన్సీపీ ఎంపీ మాజిద్ మెమొన్ అభిప్రాయపడ్డారు. అయితే ఐటీ శాఖ సమర్థవంతంగా పనిచేసేందుకే ఈ మార్పులు తీసుకొచ్చామని.. విపక్షాలు పేర్కొంటున్న ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’లో అర్థం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.
సవరణలు–సమస్యలు
► ఇప్పటివరకు ఐటీ ప్రిన్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి దాడులు జరిపేందుకు, ఐటీ డైరెక్టర్ జనరల్ సోదాలు జరిపేందుకు ఆదేశాలిచ్చే అధికారం ఉండేది. కానీ తాజా సవరణలతో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి కూడా పన్ను ఎగవేత దారుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు, దాడులు జరిపేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని విపక్షాలంటున్నాయి.
► ఐటీ చట్టం 1961 లోని 132 సెక్షన్ ప్రకారం ఎగవేతదారుడి ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసేందుకు మాత్రమే అధికారం ఉండేది. పూర్తి ఆధారాలు కోర్టుకు అందించాక కోర్టు ఆర్డర్ ద్వారానే ఆస్తులను పూర్తిగా అటాచ్ చేసేవారు. అయితే కాస్త సమయం దొరకటంతో పన్ను ఎగవేతదారులు దీన్నో అవకాశంగా మలుచుకుంటున్నందున కఠినంగా వ్యవహరించాలని కేంద్రం భావించింది. అందుకే దాడులకు నేతృత్వం వహించిన అధికారే సదరు ఆస్తులను అటాచ్ చేసే అధికారాన్ని కల్పించారు. 50 లక్షల కన్నా ఎక్కువ విలువైన ఆస్తులు వివాదాస్పదంగా ఉన్నాయనిపిస్తే.. గత పదేళ్ల ఆదాయంపైనా విచారణకు ఆదేశించే అధికారం కట్టబెట్టారు. సేవాసంస్థల ఆస్తులపైనా దాడులు జరిపే వీలు కల్పించారు.