న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేసి.. సరికొత్త మార్పులకు నాంది పలికిన నోట్లరద్దు నిర్ణయానికి బుధవారం ఏడాది నిండిన సందర్భంగా అధికార, ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ‘చీకటిదినం’ పేరుతో ఆందోళనలు నిర్వహించాయి. అధికార బీజేపీ నల్లధన వ్యతిరేక దినోత్సవం పేరుతో సంబరాలు జరిపింది. నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు డిమానిటైజేషన్‌ను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నోట్లరద్దు నిర్ణయంతో తమ వద్ద ఉన్న పెద్దనోట్లు మార్చుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని విపక్ష నాయకులు ఆరోపించారు. ఇప్పటికీ కష్టాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌తోపాటు లెఫ్ట్ తదితర విపక్ష పార్టీలు బ్లాక్‌డేలో పాల్గొని ఆందోళనలకు దిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ భారీ మారథాన్ నిర్వహించింది. నల్లదుస్తులు ధరించి కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఈ రన్‌లో పాల్గొని.. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కశ్మీర్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు చోట్ల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. వామపక్షాలు, ఇతర సామాజిక సంఘాలూ ఆందోళనల్లో పాలుపంచుకున్నాయి.
మిఠాయిలు పంచిన బీజేపీ నాయకులు
విపక్షాల బ్లాక్ డేకు వ్యతిరేకంగా బీజేపీ బుధవారం అన్ని రాష్ట్రాల్లో నల్లధన వ్యతిరేక దినాన్ని జరిపింది. పలు చోట్ల జరిగిన కార్యక్రమాలు మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ రాజధానిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. నోట్లరద్దుతో ఉగ్రవాదం, అవినీతి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు ఉత్తరప్రదేశ్‌లో పెద్దనోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించాయి. మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో మోదీ ఫొటోకు స్వీట్లు తినిపిస్తూ.. కొత్త నోట్లను ప్రదర్శిస్తూ.. బీజేపీ నేతలు ’డిమానిటైజేషన్’ సంబరాలు నిర్వహించారు. నోట్లను రద్దు చేయడం వల్ల ఉగ్రవాదం వెన్ను విరిగిందని, కశ్మీర్‌లో రాళ్లు విసిరే ఘటనలు తగ్గాయని బీజేపీ నాయకులు అన్నారు.
నల్లధనంపై యుద్ధం.. 125 కోట్ల మంది విజయం : ప్రధాని నరేంద్ర మోదీ
పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన యుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125 కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను సమర్థించిన ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ప్రధాని బుధవారం మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుతో చేకూరిన ప్రయోజనాలను ఓ లఘుచిత్రం రూపంలో తీసుకొచ్చారు. ఈ వీడియోను ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
ఇదొక మహావిషాదం : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్
పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మరోసారి మండిపడ్డారు. నోట్లరద్దు పూర్తిగా అనాలోచిత నిర్ణయమని స్పష్టం చేస్తూ ‘విషాదం’ అనే మాటకు ఏమాత్రం తక్కువ కాదని వ్యాఖ్యానించారు. ట్విటర్ వేదికగా ఆయన బుధవారం స్పందిస్తూ... ‘నోట్ల రద్దు ఓ విషాదం. ప్రధాని తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా జీవితాలు, జీవనోపాధి కోల్పోయిన కోట్లాదిమంది నిజాయతీపరులైన భారతీయులకు మేము అండగా ఉంటాం’ అని సందేశం పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక హిందీ పద్యాన్ని కూడా ఉటంకించారు. ‘ఒక్క కన్నీటి బొట్టు కూడా ప్రభుత్వానికి ప్రమాదకరమే. అయితే మీరు ఇంతటి కన్నీటి సముద్రాన్ని చూసి ఉండరు...’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనికి ఆయన జతచేసిన ఓ వయోధికుడి ఫోటో కంటతడి పెట్టించేలా ఉంది. డబ్బు చేతికి అందక ఏటీఎం ముందు నిలబడి విలపిస్తున్న ఈ దృశ్యం నెటిజన్లను కదిలిస్తోంది.
సంక్షిప్తంగా..
నోట్లరద్దు కారణంగా అనేక మంది తమ జీవితాలను, ఉద్యోగాలను కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం రూ. 15 లక్షల కోట్లు నగదు చలామణీలో ఉందని, త్వరలో అది రూ. 17 లక్షల కోట్లకు చేరుకుంటుందని అన్నారు. కృత్రిమంగా నగదు కొరత సృష్టించడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందన్నారు.
తమిళనాడువ్యాప్తంగా విపక్ష పార్టీ డీఎంకే బ్లాక్ డే కార్యక్రమాల్లో పాల్గొంది. నోట్లరద్దు సామాన్యుడికి కష్టాలు మినహా ఏమీ మిగల్చలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. బ్యాంకు క్యూల్లో నిలబడి ఎంతో మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత ప్రభుత్వ తప్పుడు విధానాలు ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాయన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బీజేపీ మిత్రులే లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రజలకేమీ మేలు జరగలేదని స్టాలిన్ స్పష్టం చేశారు.
పాట్నాలో జరిగిన బ్లాక్ డే ఆందోళనల్లో పాల్గొన్న ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నోట్లరద్దు వల్ల సంపన్నులు సులువుగా తమ నల్లధనాన్ని తెలుపుగా మార్చుకున్నారని ఆరోపించారు. బిహార్ వ్యాప్తంగా ఆర్జేడీ ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించింది.
నోట్లరద్దు తొందరపాటు, అపరిపక్వ నిర్ణయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. దీనివల్ల కోట్ల మంది భారతీయులు ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఇప్పటికీ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ వద్దే నల్లదనం అధికంగా ఉందనే విషయం ప్యారడైజ్ పత్రాల ద్వారా వెల్లడయిందన్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజధాని ముంబైలో జరిగిన బ్లాక్ డేలో పాల్గొన్న మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ నోట్లరద్దుపై పార్లమెంటరీ సంయుక్త సంఘంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మిత్రపక్షం కూడా అయిన శివసేన అధికార పార్టీకి కర్మకాండలు నిర్వహించింది.ఎన్సీపీ నాయకులు పుణేలో బ్లాక్ డే నిర్వహించారు. పార్టీ అధిపతి శరద్ పవార్ సహా కీలక నేతలు పలువురు ఆందోళనల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment