
ప్రధాని వచ్చినా పార్లమెంటు స్తంభనే!
► మోదీ క్షమాపణకు విపక్షాల పట్టు
► ఉభయ సభల్లో ఆందోళన
న్యూఢిల్లీ: పార్లమెంటులో నోట్లరద్దుపై వరుసగా 11వ రోజూ గందరగోళం కొనసాగింది. ప్రధాని మోదీ రాజ్యసభకు హాజరైనా.. విపక్షాలు చర్చకు అంగీకరించలేదు. నోట్లరద్దు నేపథ్యంలో విపక్షాలపై చేసిన విమర్శలకు మోదీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో సభలో గందరగోళం నెలకొంది. అటు లోక్‌సభలోనూ అదే పరిస్థితి. దీంతో ఉభయసభలూ వాయిదా పడ్డాయి. కాగా, సభ వాయిదా పడినప్పటికీ 15 నిమిషాల సేపు మోదీ సభలోనే కూర్చున్నారు.
మారని విపక్షాల తీరు
శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచీ ప్రధాని సభకు రావాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు.. గురువారం మోదీ రాజ్యసభకు హాజరైనా ఆందోళన విరమించలేదు. పలుమార్లు నోట్లరద్దుపై చర్చ మొదలుపెట్టాలని చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పినా విపక్షాలు తగ్గలేదు. ‘విపక్షాలు నల్లధనానికి మద్దతుగా ఉన్నాయని మోదీ అంటున్నారు. ఇది దారుణం. ప్రధాని క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభ వారుుదా పడింది. మధ్యాహ్నం కూడా ప్రధాని సభకొచ్చారు. మోదీ క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేయగా, 60 ఏళ్లపాటు దేశాన్ని పాలించి చీకట్లోకి నెట్టేసిన కాంగ్రెస్ దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఐటీ బిల్లుపై చొరవ తీసుకోండి: కేంద్రం ఆదాయపు పన్ను బిల్లుకు సవరణకు తీసుకురావటంపై విపక్షాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గురువారం ఫిర్యాదు చేశాయి. ‘లోక్‌సభ నిబంధనలకు తిలోదకాలిచ్చి కేంద్రం సంఖ్యాబలంతో సవరణల బిల్లును ఆమోదించింది రాజ్యాంగ హక్కులను కాలరాసి తీసుకున్న నిర్ణయంపై చొరవతీసుకోగలరు’ అని రాష్ట్రపతిని కోరారు.