The winter session of Parliament
-
రాజీనామా చేయాలనిపిస్తోంది
సభలో వాజ్‌పేయి ఉంటే బాధపడేవారని అడ్వాణీ వ్యాఖ్య న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడమే మంచిదనిపిస్తోందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారని చెప్పారు. గురువారం స్పీకర్ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేయడంతో అసంతృప్తికి గురైన అడ్వాణీ.. ఈ విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో మాట్లాడారు. ఆమె ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన అడ్వాణీ మాటలను సావధానంగా ఆలకించారు. రాజ్‌నాథ్ జోక్యం చేసుకుని సభ సజావుగా జరిగేలా చూడాలని, స్పీకర్‌తో మాట్లాడాలని అడ్వాణీ కోరారు. కనీసం శుక్రవారమైనా కార్యకలాపాలు సజావుగా జరిపేందుకు ప్రయత్నించాలని కోరారు. గతంలో సభా సమావేశాల తీరుపై కేంద్ర మంత్రి అనంతకుమార్ వద్ద కూడా అడ్వాణీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అడ్వాణీకి కృతజ్ఞతలు: రాహుల్ బీజేపీలో ఉండి ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నందుకు అడ్వాణీకి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ‘అధికార పార్టీలో ఉంటూ ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్న అడ్వాణీకి కృతజ్ఞతలు’అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు ‘అడ్వాణీ సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ’ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. లోక్‌సభలో ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పి.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని, ‘విజయ్ చౌక్‌లో ఉరేసుకోవాలనిపిస్తోంద’ని మల్లికార్జున ఖర్గే లోక్‌సభ అధికారితో అన్నారు. అడ్వాణీ బాధ అర్థం చేసుకోగలను: స్పీకర్ అడ్వాణీ బాధను తాను అర్థం చేసుకోగలనని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. పార్లమెంటు ఆరోగ్యకర చర్చలకు వేదిక కావాలని.. కానీ అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు సజావుగా సాగకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దీంతో అడ్వాణీయే కాదు దేశంలో ప్రతి వ్యక్తీ విచారిస్తున్నాడని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. నేడు ప్రధాని వద్దకు రాహుల్ బృందం ఉత్తరప్రదేశ్‌లో తాను చేపట్టిన ‘కిసాన్ యాత్ర’ సందర్భంగా రైతులు చేసిన డిమాండ్లను తెలియజేసేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష పార్టీల బృందం శుక్రవారం ఉదయం ప్రధానిని కలవనుంది. ఆ తర్వాత ఈ బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి నోట్లరద్దు సమస్యలపై ఫిర్యాదు చేయనుంది. -
ప్రధాని వచ్చినా పార్లమెంటు స్తంభనే!
► మోదీ క్షమాపణకు విపక్షాల పట్టు ► ఉభయ సభల్లో ఆందోళన న్యూఢిల్లీ: పార్లమెంటులో నోట్లరద్దుపై వరుసగా 11వ రోజూ గందరగోళం కొనసాగింది. ప్రధాని మోదీ రాజ్యసభకు హాజరైనా.. విపక్షాలు చర్చకు అంగీకరించలేదు. నోట్లరద్దు నేపథ్యంలో విపక్షాలపై చేసిన విమర్శలకు మోదీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో సభలో గందరగోళం నెలకొంది. అటు లోక్‌సభలోనూ అదే పరిస్థితి. దీంతో ఉభయసభలూ వాయిదా పడ్డాయి. కాగా, సభ వాయిదా పడినప్పటికీ 15 నిమిషాల సేపు మోదీ సభలోనే కూర్చున్నారు. మారని విపక్షాల తీరు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచీ ప్రధాని సభకు రావాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు.. గురువారం మోదీ రాజ్యసభకు హాజరైనా ఆందోళన విరమించలేదు. పలుమార్లు నోట్లరద్దుపై చర్చ మొదలుపెట్టాలని చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పినా విపక్షాలు తగ్గలేదు. ‘విపక్షాలు నల్లధనానికి మద్దతుగా ఉన్నాయని మోదీ అంటున్నారు. ఇది దారుణం. ప్రధాని క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభ వారుుదా పడింది. మధ్యాహ్నం కూడా ప్రధాని సభకొచ్చారు. మోదీ క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేయగా, 60 ఏళ్లపాటు దేశాన్ని పాలించి చీకట్లోకి నెట్టేసిన కాంగ్రెస్ దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఐటీ బిల్లుపై చొరవ తీసుకోండి: కేంద్రం ఆదాయపు పన్ను బిల్లుకు సవరణకు తీసుకురావటంపై విపక్షాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గురువారం ఫిర్యాదు చేశాయి. ‘లోక్‌సభ నిబంధనలకు తిలోదకాలిచ్చి కేంద్రం సంఖ్యాబలంతో సవరణల బిల్లును ఆమోదించింది రాజ్యాంగ హక్కులను కాలరాసి తీసుకున్న నిర్ణయంపై చొరవతీసుకోగలరు’ అని రాష్ట్రపతిని కోరారు. -
నేటి నుంచి పార్లమెంటు భేటీ
-
వాడి వేడిగా ‘శీతాకాలం’
నేటి నుంచి పార్లమెంటు భేటీ సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడి పుట్టించనున్నాయి. పెద్ద నోట్ల రద్దు, నల్లధనం, అవినీతి అంశాలపై ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి దాడి చేసేందుకు విపక్షాలు ఏకమవ్వాలని నిర్ణయించగా.. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని మోదీ అఖిలపక్షాన్ని కోరారు. మరోవైపు, విపక్షాలు మూకుమ్మడి దాడిని దీటుగా ఎదుర్కొని విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. నెలరోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో నోట్ల రద్దుతో పాటు సర్జికల్ దాడులు, జమ్మూకశ్మీర్, ఓఆర్ఓపీ, రైతుల సమస్యలు వంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ, పార్లమెంట్ సమావేశాలలో తొలుత పెద్ద నోట్ల రద్దు, తదనంతరం ప్రజల అవస్థలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దుపై సంయుక్త పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపజేయనున్నాయి. సహకరించండి, చర్చిద్దాం: ప్రధాని నల్లధనం, అవినీతి తదితర అంశాలపై పార్లమెంట్ లోపల, బయట ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని మోదీ అన్ని పార్టీలను కోరారు. శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాలు పార్లమెంట్లో తాము లేవనెత్తే అంశాలను వెల్లడించగా.. అన్ని సమస్యలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమమని, ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు సహకరించాలని మోదీ కోరారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి సహకరించాలన్నారు.విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సర్కారు సిద్ధమేనని అఖిలపక్షం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. ఇదో పెద్ద కుంభకోణం: ఆజాద్ అఖిలపక్ష భేటీ తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్‌పక్షనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ బాధ పడుతున్నారని, దేశంలో ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో సహా పలు సమస్యలపై ప్రతిపక్షాలన్ని ఐక్యంగా ఉన్నాయని, కలసి కట్టుగా పార్లమెంట్లో సమస్యలను లేవదీస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును తాము వ్యతిరేకించడం లేదని, తొందరపాటుతనంతో, ఏమాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా దేశంలో ఆర్థిక గందరగోళాన్ని ప్రభుత్వం సష్టించిందని ఆజాద్ చెప్పారు. సమరమే: విపక్షాలు అఖిలపక్షం తర్వాత విపక్షాలు (తృణమూల్, సీపీఎం, బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ, జేడీయూ, డీఎంకే, ఇతర పార్టీలు) సమావేశమయ్యాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. అటు, మరోవైపు, 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. పార్లమెంటు సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దుతో జీఎస్టీలో నాలుగు శ్లాబులు (28 శాతం వరకు) ప్రవేశపెడితే వ్యతిరేకించాలని నిర్ణయించారు. సోనియా ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. -
నవంబర్ 16 నుంచి పార్లమెంట్
సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లుల ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూలు సంప్రదాయానికి భిన్నంగా ఒకింత ముందుకు జరిగింది. సాధారణంగా నవంబర్ చివరి వారంలో ప్రారంభమై క్రిస్మస్ పర్వదినానికి ఒకటి రెండు రోజుల ముందు పూర్తయ్యే ఈ శీతాకాల సమావేశాలను ఈ ఏడాది నవంబర్ 16వ తేదీనే ప్రారంభించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) గురువారం నిర్ణయించింది. నవంబర్ 16న మొదలై డిసెంబర్ 16వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి మిగిలి ఉన్న సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాలను పూర్తిచేయాలన్న సంకల్పంతో కేంద్రం శీతాకాల సమావేశాల షెడ్యూలును ముందుకు జరిపింది. జీఎస్టీ అమలుకు వీలుగా 122వ రాజ్యాంగ సవరణ పూర్తయినప్పటికీ సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడి అంశం ప్రధానంగా మారే అవకాశముంది. -
పార్లమెంట్ సమావేశాలపై మార్కెట్ దృష్టి!
క్యూ2 జీడీపీ గణాంకాలపై కూడా: నిపుణుల అంచనా న్యూఢిల్లీ: రికార్డుల మీద రికార్డుల్ని సృష్టిస్తున్న భారత స్టాక్ మార్కెట్, వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మరిన్ని సంస్కరణలుంటాయన్న అంచనాలతో కొత్త గరిష్టస్థాయికి చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వారంలో వెల్లడికానున్న జీడీపీ గణాంకాలు మార్కెట్‌పై తక్షణ ప్రభావం చూపిస్తాయని, నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. గతవారం 288 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త రికార్డుస్థాయి 28,335 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,477 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇన్వెస్టర్లు ఆశించే సంస్కరణలు వుండవచ్చన్న అంచనాలతో మార్కెట్ తక్షణం సరికొత్త గరిష్టస్థాయికి పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జీఎస్టీకి సంబంధించిన బిల్లులు, బొగ్గు రంగ సంస్కరణల్ని ఈ సమావేశాల్లో ఆవిష్కరిస్తారన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. బీమా బిల్లు వంటివాటి ఆమోదం విషయంలో విపక్షాలు కఠినవైఖరిని అవలంబిస్తున్నా, తాము ఈ సమావేశాల్లో ముందుకు వెళతామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు 27వ తేదీన ముగియనున్నందున మార్కెట్ ఈ వారం హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాలిక్ తెలిపారు. జీడీపీ డేటా 28న వెల్లడికానున్న సందర్భంగా కూడా సూచీల ఊగిసలాట వుండవొచ్చని ఆయన అన్నారు. అయితే విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మార్కెట్ ఆశావహ దృక్పథం ఈ వారం సూచీల్ని గరిష్టస్థాయిలో స్థిరపడవచ్చని ఆయన వివరించారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 8,100-8,500 మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చనేది బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా. వచ్చేనెల తొలివారంలో జరగనున్న ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో అనుకూల ప్రకటన వెలువడవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని, వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు డిసెంబర్ 2నాటి సమీక్షలో వెలువడితే మార్కెట్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 20,000 కోట్లు భారత్ క్యాపిటల్ మార్కెట్లో నవంబర్ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దాదాపు రూ. 20,000 కోట్లు పెట్టుబడి చేశారు. ఇందులో ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ. 10,778 కోట్లు, రుణ పత్రాల మార్కెట్లో రూ. 8,870 కోట్లు పెట్టుబడి చేసినట్లు సెబీ తాజా గణాంకాల్లో వెల్లడైంది. -
సర్వసభ్య సమావేశం అనుమానమే?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ చివరి పాలకమండలి సమావేశం జరుగుతుందా? చివరి భేటీలో అధికారుల తీరును ఇరుకున పెట్టాలనుక్ను ప్రజాప్రతినిధుల ఆశలు అడియాలు కానున్నాయా? కీలక అంశాలు చర్చించకుండానే పాలక మండలి గడువు ముగియనుందా?ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికార వర్గాలు. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చేనెల 3వ తేదీతో ముగుస్తోంది. ఆలోగా చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించాలనుకున్నారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు జీహెచ్ంఎసీ సర్వసభ్య సమావేశం నిర్వహించకూడదు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్అఫీషియో సభ్యులు సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా ఈ నిబంధన రూపొందించారు. ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈనెల 22 వరకే అసెంబ్లీ జరగాలి. దీంతో 29న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి మేయర్ తేదీని ఖరారు చేశారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు 29వ తేదీ వరకు జరిపేందుకు నిర్ణయించడంతో సర్వసభ్య సమావేశం జరిపేందుకు వీల్లేకుండా పోయింది. ఆ తర్వాతనైనా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలనుకుంటే.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసేలోగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. ప్రత్యేక అనుమతులతో తప్ప జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం లేదు. చివరి సమావేశంలో తీవ్రంగా స్పందించాలని పలువురు ప్రజాప్రతినిధులు భావించా రు. ఆమేరకు ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. మేయర్‌కు, కమిషనర్‌కు మధ్య అభిప్రాయభేదాలు బహిరంగం కావడంతో చివరి సర్వసభ్యసమావేశంలో అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య యుద్ధం జరగగలదనే చర్చ జరిగింది. తీరా సర్వసభ్య సమావేశమే జరగని పరిస్థితి ఎదురవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటుండగా... ఎలాగైనా సమావేశాన్ని జరపాలనే యోచనలో కొందరు ఉన్నారు. అందుకు తగ్గ అవకాశాలేమైనా ఉన్నాయేమోననే ఆలోచనలో పడ్డారు. -
అనవసరమైన టూర్లు తగ్గించి సభకు హాజరుకండి
పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కేబినెట్ సహచరులకు మోదీ ఆదేశం న్యూఢిల్లీ: నెలరోజుల జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో హాజరుపై తన మంత్రివర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ కచ్చితమైన ఆదేశాలిచ్చారు. అనవసరమైన పర్యటనలు తగ్గించుకుని, పార్లమెంటు ఉభయసభల్లో ఎక్కువ రోజులు కనిపించాలని, పార్లమెంటు ఆమోదించవలసిన పెండింగ్ బిల్లులతో, శాసనాల ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సోమవారం తన మంత్రివర్గ సహచరులతో రెండు గంటలసేపు భేటీ అయిన సందర్బంగా ప్రధాని ఈ ఆదేశాలిచ్చారు. అనంతరం 20నిమిషాలసేపు కేబినెట్ సమావేశానికి కూడా మోదీ అధ్యక్షత వహించారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో పదిరోజుల పర్యటనకు బయలుదేరే ముందు ఒక రోజు ముందు ప్రధాని ఈ బేటీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజీజు విదేశీ పర్యటనల్లో ఉన్నందున సోమవారం నాటి బేటీలకు హాజరుకాలేకపోయారు. శివసేనకు చెందిన మంత్రి అనంత్ గీతే మాత్రం సమావేశానికి హాజరైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా మంత్రిపదవులు పొందిన వారి బాధ్యతల గురించి, వారిలో ఉత్తేజం కలిగే రీతిలో ప్రధాని,. మంత్రుల భేటీలో ప్రసంగించారు. ఈ నెల 24నుంచి డిసెంబర్ 23వరకూ జరగనున్న పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అనుసరించవలసిన వ్యూహంపై ప్రధాని మంత్రులతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పాతబిల్లులతో పాటుగా, కీలకమైన కొన్ని కొత్త బిల్లులను సభచేత ఆమోదింపజేసుకునే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల వ్యవధిలో ఎదురయ్యే అంశాలపై తగిన సమాధానాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మంత్రులకు విరామం అంటూ ఉండదని, సెలవురోజుల్లో కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని మోదీ తన సహచరులకు స్పష్టంచేసినట్టు తెలిసింది. కేబినెట్ మంత్రులు, సహాయమంత్రుల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన సూచించారు. -
వచ్చే నెల లోక్‌సభలో సీట్ల కేటాయింపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే లోక్‌సభలో సభ్యులకు సీట్ల కేటాయింపు పూర్తయ్యే అవకాశముంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు పూర్తయినా ఇప్పటి వరకూ సీట్ల కేటాయింపు కొలిక్కి రాని సంగతి తెలిసిందే. వచ్చే నెలలో శీతాకాల సమావేశాలకు ముందే లోక్‌సభలో పార్టీలకు సీట్లను కేటాయించే అవకాశం ఉందని పార్లమెంట్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం జరిగే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 24న ప్రారంభమై నెల రోజులు కొనసాగుతాయి. లోక్‌సభలో ఏ పార్టీకీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఎక్కువ పార్టీలు ముందు వరుస సీట్లను కేటాయించాలని స్పీకర్‌ను కోరుతున్నాయి.