- పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కేబినెట్ సహచరులకు మోదీ ఆదేశం
న్యూఢిల్లీ: నెలరోజుల జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో హాజరుపై తన మంత్రివర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ కచ్చితమైన ఆదేశాలిచ్చారు. అనవసరమైన పర్యటనలు తగ్గించుకుని, పార్లమెంటు ఉభయసభల్లో ఎక్కువ రోజులు కనిపించాలని, పార్లమెంటు ఆమోదించవలసిన పెండింగ్ బిల్లులతో, శాసనాల ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సోమవారం తన మంత్రివర్గ సహచరులతో రెండు గంటలసేపు భేటీ అయిన సందర్బంగా ప్రధాని ఈ ఆదేశాలిచ్చారు. అనంతరం 20నిమిషాలసేపు కేబినెట్ సమావేశానికి కూడా మోదీ అధ్యక్షత వహించారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో పదిరోజుల పర్యటనకు బయలుదేరే ముందు ఒక రోజు ముందు ప్రధాని ఈ బేటీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజీజు విదేశీ పర్యటనల్లో ఉన్నందున సోమవారం నాటి బేటీలకు హాజరుకాలేకపోయారు.
శివసేనకు చెందిన మంత్రి అనంత్ గీతే మాత్రం సమావేశానికి హాజరైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా మంత్రిపదవులు పొందిన వారి బాధ్యతల గురించి, వారిలో ఉత్తేజం కలిగే రీతిలో ప్రధాని,. మంత్రుల భేటీలో ప్రసంగించారు. ఈ నెల 24నుంచి డిసెంబర్ 23వరకూ జరగనున్న పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అనుసరించవలసిన వ్యూహంపై ప్రధాని మంత్రులతో చర్చించారు.
పెండింగ్‌లో ఉన్న పాతబిల్లులతో పాటుగా, కీలకమైన కొన్ని కొత్త బిల్లులను సభచేత ఆమోదింపజేసుకునే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల వ్యవధిలో ఎదురయ్యే అంశాలపై తగిన సమాధానాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మంత్రులకు విరామం అంటూ ఉండదని, సెలవురోజుల్లో కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని మోదీ తన సహచరులకు స్పష్టంచేసినట్టు తెలిసింది. కేబినెట్ మంత్రులు, సహాయమంత్రుల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన సూచించారు.