
రాజీనామా చేయాలనిపిస్తోంది
సభలో వాజ్‌పేయి ఉంటే బాధపడేవారని అడ్వాణీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడమే మంచిదనిపిస్తోందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారని చెప్పారు. గురువారం స్పీకర్ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేయడంతో అసంతృప్తికి గురైన అడ్వాణీ.. ఈ విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో మాట్లాడారు. ఆమె ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన అడ్వాణీ మాటలను సావధానంగా ఆలకించారు. రాజ్‌నాథ్ జోక్యం చేసుకుని సభ సజావుగా జరిగేలా చూడాలని, స్పీకర్‌తో మాట్లాడాలని అడ్వాణీ కోరారు. కనీసం శుక్రవారమైనా కార్యకలాపాలు సజావుగా జరిపేందుకు ప్రయత్నించాలని కోరారు. గతంలో సభా సమావేశాల తీరుపై కేంద్ర మంత్రి అనంతకుమార్ వద్ద కూడా అడ్వాణీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అడ్వాణీకి కృతజ్ఞతలు: రాహుల్
బీజేపీలో ఉండి ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నందుకు అడ్వాణీకి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ‘అధికార పార్టీలో ఉంటూ ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్న అడ్వాణీకి కృతజ్ఞతలు’అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు ‘అడ్వాణీ సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ’ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. లోక్‌సభలో ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పి.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని, ‘విజయ్ చౌక్‌లో ఉరేసుకోవాలనిపిస్తోంద’ని మల్లికార్జున ఖర్గే లోక్‌సభ అధికారితో అన్నారు.
అడ్వాణీ బాధ అర్థం చేసుకోగలను: స్పీకర్
అడ్వాణీ బాధను తాను అర్థం చేసుకోగలనని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. పార్లమెంటు ఆరోగ్యకర చర్చలకు వేదిక కావాలని.. కానీ అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు సజావుగా సాగకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దీంతో అడ్వాణీయే కాదు దేశంలో ప్రతి వ్యక్తీ విచారిస్తున్నాడని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు.
నేడు ప్రధాని వద్దకు రాహుల్ బృందం
ఉత్తరప్రదేశ్‌లో తాను చేపట్టిన ‘కిసాన్ యాత్ర’ సందర్భంగా రైతులు చేసిన డిమాండ్లను తెలియజేసేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష పార్టీల బృందం శుక్రవారం ఉదయం ప్రధానిని కలవనుంది. ఆ తర్వాత ఈ బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి నోట్లరద్దు సమస్యలపై ఫిర్యాదు చేయనుంది.