పార్లమెంట్ సమావేశాలపై మార్కెట్ దృష్టి!
క్యూ2 జీడీపీ గణాంకాలపై కూడా: నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: రికార్డుల మీద రికార్డుల్ని సృష్టిస్తున్న భారత స్టాక్ మార్కెట్, వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మరిన్ని సంస్కరణలుంటాయన్న అంచనాలతో కొత్త గరిష్టస్థాయికి చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వారంలో వెల్లడికానున్న జీడీపీ గణాంకాలు మార్కెట్‌పై తక్షణ ప్రభావం చూపిస్తాయని, నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.
గతవారం 288 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్ కొత్త రికార్డుస్థాయి 28,335 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,477 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇన్వెస్టర్లు ఆశించే సంస్కరణలు వుండవచ్చన్న అంచనాలతో మార్కెట్ తక్షణం సరికొత్త గరిష్టస్థాయికి పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జీఎస్‌టీకి సంబంధించిన బిల్లులు, బొగ్గు రంగ సంస్కరణల్ని ఈ సమావేశాల్లో ఆవిష్కరిస్తారన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. బీమా బిల్లు వంటివాటి ఆమోదం విషయంలో విపక్షాలు కఠినవైఖరిని అవలంబిస్తున్నా, తాము ఈ సమావేశాల్లో ముందుకు వెళతామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే ప్రకటించారు.
నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు 27వ తేదీన ముగియనున్నందున మార్కెట్ ఈ వారం హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాలిక్ తెలిపారు. జీడీపీ డేటా 28న వెల్లడికానున్న సందర్భంగా కూడా సూచీల ఊగిసలాట వుండవొచ్చని ఆయన అన్నారు. అయితే విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మార్కెట్ ఆశావహ దృక్పథం ఈ వారం సూచీల్ని గరిష్టస్థాయిలో స్థిరపడవచ్చని ఆయన వివరించారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 8,100-8,500 మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చనేది బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా. వచ్చేనెల తొలివారంలో జరగనున్న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో అనుకూల ప్రకటన వెలువడవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని, వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు డిసెంబర్ 2నాటి సమీక్షలో వెలువడితే మార్కెట్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అన్నారు.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 20,000 కోట్లు
భారత్ క్యాపిటల్ మార్కెట్లో నవంబర్ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దాదాపు రూ. 20,000 కోట్లు పెట్టుబడి చేశారు. ఇందులో ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ. 10,778 కోట్లు, రుణ పత్రాల మార్కెట్లో రూ. 8,870 కోట్లు పెట్టుబడి చేసినట్లు సెబీ తాజా గణాంకాల్లో వెల్లడైంది.