రెండో రోజూ నష్టాలే...
* 43 పాయింట్ల నష్టంతో 25,580కు సెన్సెక్స్
* 7 పాయింట్ల నష్టపోయి 7,785కు నిఫ్టీ
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా ఆర్థిక వ్యవస్థపై తాజాగా రేగిన ఆందోళనలు కొనసాగడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 43 పాయింట్లు నష్టపోయి 25,580 పాయింట్ల వద్ద. నిఫ్టీ చివరకు 7 పాయింట్ల నష్టంతో 7,785 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇది సెన్సెక్స్‌కు రెండు వారాల కనిష్ట స్థాయి.
లోహ, ఆయిల్, గ్యాస్, రియల్టీ, యుటిలిటీస్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఇటీవల పతనం కారణంగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న రియల్టీ, విద్యుత్తు, ఆయిల్, గ్యాస్ షేర్లో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. 25,745 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 25,767-25,514 పాయింట్లు, గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నిఫ్టీ 68 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
ఏడాది చివరకు నిఫ్టీ @ 8,200: యూబీఎస్ అంచనా
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ ఏడాది చివరకు 8,200 పాయింట్లకు చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం యూబీఎస్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. జీడీపీ అంచనా 7.6%. 2016-17లో 7.8% అంచనా.