లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాలు
42 పాయింట్ల నష్టంతో 27,646కు సెన్సెక్స్
⇒ 300 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్
⇒ 8 పాయింట్ల నష్టంతో 8,366కు నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, లాభాల స్వీకరణ కారణంగా భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. రెండు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 42పాయింట్లు పతనమై 27,646 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8 పాయింటు నష్టపోయి 8,366 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్రమైన ఊగిసలాటకు గురైంది.
మరింత కన్సాలిడేషన్!
ప్రధానమైన సానుకూలమైన సంఘటనలేమీ లేకపోవడంతో గత రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని నిపుణులంటున్నారు. అయితే ఎంపిక చేసిన సెన్సెక్స్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్‌కు స్వల్పనష్టాలే వచ్చాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతుండడం మరింత కన్సాలిడేషన్‌కు సూచిక అని జియోజిత్ బీఎన్‌పీ పారిబస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు.
17 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు
30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు నష్టాల్లో, 12 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ షేర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.హెచ్‌డీఎఫ్‌సీ 2% క్షీణించింది. ఇదే బాటలో టాటా మోటార్స్ 1.95 శాతం, ఓఎన్‌జీసీ 1.6%, బజాజ్ ఆటో 1%, హిందూస్తాన్ యూనిలివర్ 0.8% చొప్పున పడిపోయాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే హీరో మోటొకార్ప్ 2 శాతం, విప్రో 1.6 శాతం, వేదాంత 1.4% చొప్పున పెరిగాయి. 1,453 షేర్లు లాభాల్లో, 1,289 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో 3,444 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,809 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 2,79,809 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్ఠర్లు రూ.48 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.451 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.