కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ.. | Sensex Eyes 30000 after Obama's Visit; Nifty Scales 8900 | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ..

Published Wed, Jan 28 2015 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ..

కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ..

ఇంట్రాడే, ముగింపులో కొత్త శిఖరాలకు సూచీలు
* 8,900 మార్క్‌ను దాటిన నిఫ్టీ, 75 పాయింట్లు ప్లస్
* 292 పాయింట్ల లాభంతో 29,571కు సెన్సెక్స్

ముంబై: భారత స్టాక్‌మార్కెట్లో ఇటీవల ప్రతిరోజూ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగుస్తున్నాయి. సోమవారం రిపబ్లిక్‌డే సెలవు అనంతరం మంగళవారం ప్రారంభమైన మార్కెట్ రికార్డుల ర్యాలీని కొనసాగించింది. వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి.

సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి 29,619, నిఫ్టీ 8,925 పాయింట్లను తాకాయి. చివరకు సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 29,571 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 8,911 వద్ద ముగిశాయి. ఇవి రెండూ రికార్డ్ స్థాయి ముగింపులు. ఈ సూచీలు రికార్డ్ స్థాయిల వద్ద ముగియడం ఇది వరుసగా ఐదో రోజు. తాజా ర్యాలీలో నిఫ్టీ తొలిసారిగా 8,900 మార్క్‌ను దాటేసింది. ఉదయం ట్రేడింగ్‌లో మార్కెట్ స్థిరీకరణ సూచనలు కనిపించాయి. కానీ చివరి గంటలో బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు అనూహ్యంగా పెరిగిపోయాయి. వరుసగా 8 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 2,224 పాయింట్లు(8%), నిఫ్టీ 600 పాయింట్ల చొప్పన లాభపడ్డాయి.  
 
జోష్‌నిచ్చిన ఒబామా పర్యటన

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలు మరింత పటిష్టం కానుండడం స్టాక్ మార్కెట్లలో జోష్‌ను పెంచింది.  గ్రీస్ ఎన్నికల్లో సంస్కరణలను వ్యతిరేకించే సిరిజా పార్టీ విజయం సాధించడంతో ఆసియా మార్కెట్లు ఊగిసలాటకు గురైనా, భారత మార్కెట్లు  దూసుకెళ్లాయి. ఒబామా పర్యటన సందర్భంగా భారత్‌లో వాణిజ్య వ్యాపార కార్యకలాపాల కోసం అమెరికా 400 కోట్ల డాలర్లు పెట్టుబడులు, రుణాల రూపంలో అందించనుండడం మార్కెట్లకు జోష్‌నిచ్చిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు.

అమెరికాతో అణు బంధం బలపడుతున్న కారణంగా క్యాపిటల్ గూడ్స్, రక్షణ రంగ షేర్లు వెలుగులు విరజిమ్మాయి. భెల్, ఎల్ అండ్ టీ, పిపవావ్ డిఫెన్స్, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ షేర్లు 1-7 శాతం రేంజ్‌లో పెరిగాయి.  సిప్లా 4.6%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.5%, ఐటీసీ 3%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.9%, టాటా మోటార్స్ 2.9 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.1 శాతం చొప్పున పెరిగాయి. కాగా, మంగళవారం విదేశీ ఇన్వెస్టర్ల రూ.953 కోట్ల నికర కొనుగోళ్లు జరపారు. దేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ.783 కోట్లుగా నమోదయ్యాయి.
 
బడ్జెట్ వరకూ బ్యాంక్ షేర్ల జోరు

గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,224 పాయింట్లు లాభపడింది. దీంట్లో సగం వాటా (1,200 పాయింట్ల మేర)  ఐదు ఆర్థిక రంగ షేర్లదే. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్ల పెరుగుదలతో సెన్సెక్స్ దూసుకుపోతుందని, వచ్చేవారంలో జరిగే పరపతి సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పరుగులు పెడుతున్నాయని విశ్లేషకులంటున్నారు. కాగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యస్‌బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో గరిష్ట స్థాయిలను తాకాయి.

మంచి పనితీరు, ఇటీవలి రేట్ల కోత, కొన్ని బ్యాంకులకు అనుబంధ బీమా, బ్రోకరేజ్ కంపెనీలు ఉండడం(బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు త్వరలో ఆమోదం పొందే అవకాశాలున్నాయి) వంటి కారణాల వల్ల ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు బాగా పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు. బడ్జెట్ వరకూ బ్యాంకింగ్ షేర్ల హవా కొనసాగుతుందని, బడ్జెట్ తర్వాత కరెక్షన్ ఉంటుందనేది వారి అభిప్రాయం. కాగా యాక్సిస్ బ్యాంక్ షేర్ రికార్డ్ స్థాయిని(రూ.598) తాకి 4.7% లాభంతో రూ.592 వద్ద ముగిసింది. ఈ షేర్ రూ.840కు చేరుతుందనేది మోర్గాన్ స్టాన్లీ అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement