
వాడి వేడిగా ‘శీతాకాలం’
నేటి నుంచి పార్లమెంటు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడి పుట్టించనున్నాయి. పెద్ద నోట్ల రద్దు, నల్లధనం, అవినీతి అంశాలపై ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి దాడి చేసేందుకు విపక్షాలు ఏకమవ్వాలని నిర్ణయించగా.. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని మోదీ అఖిలపక్షాన్ని కోరారు. మరోవైపు, విపక్షాలు మూకుమ్మడి దాడిని దీటుగా ఎదుర్కొని విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
నెలరోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో నోట్ల రద్దుతో పాటు సర్జికల్ దాడులు, జమ్మూకశ్మీర్, ఓఆర్‌ఓపీ, రైతుల సమస్యలు వంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ, పార్లమెంట్ సమావేశాలలో తొలుత పెద్ద నోట్ల రద్దు, తదనంతరం ప్రజల అవస్థలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దుపై సంయుక్త పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపజేయనున్నాయి.
సహకరించండి, చర్చిద్దాం: ప్రధాని
నల్లధనం, అవినీతి తదితర అంశాలపై పార్లమెంట్ లోపల, బయట ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని మోదీ అన్ని పార్టీలను కోరారు. శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో తాము లేవనెత్తే అంశాలను వెల్లడించగా.. అన్ని సమస్యలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమమని, ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు సహకరించాలని మోదీ కోరారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి సహకరించాలన్నారు.విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సర్కారు సిద్ధమేనని అఖిలపక్షం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అనంత్ కుమార్ చెప్పారు.
ఇదో పెద్ద కుంభకోణం: ఆజాద్
అఖిలపక్ష భేటీ తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్‌పక్షనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ బాధ పడుతున్నారని, దేశంలో ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో సహా పలు సమస్యలపై ప్రతిపక్షాలన్ని ఐక్యంగా ఉన్నాయని, కలసి కట్టుగా పార్లమెంట్‌లో సమస్యలను లేవదీస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును తాము వ్యతిరేకించడం లేదని, తొందరపాటుతనంతో, ఏమాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా దేశంలో ఆర్థిక గందరగోళాన్ని ప్రభుత్వం సష్టించిందని ఆజాద్ చెప్పారు.
సమరమే: విపక్షాలు
అఖిలపక్షం తర్వాత విపక్షాలు (తృణమూల్, సీపీఎం, బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ, జేడీయూ, డీఎంకే, ఇతర పార్టీలు) సమావేశమయ్యాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. అటు, మరోవైపు, 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. పార్లమెంటు సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దుతో జీఎస్టీలో నాలుగు శ్లాబులు (28 శాతం వరకు) ప్రవేశపెడితే వ్యతిరేకించాలని నిర్ణయించారు. సోనియా ఈ సమావేశానికి నేతృత్వం వహించారు.