
సాక్షి, బెంగళూరు: ఆధార్ వ్యవస్థను అప్రతిష్టపాలు చేసేందుకు పద్ధతిప్రకారం దుష్ప్రచారం జరుగుతోందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) మాజీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న నీలేకని.. దేశంలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పత్రాల్లో అత్యంత విశిష్టమైన ఆధార్‌పై కావాలనే అవాస్తవాలను ప్రచారం చేస్తుండటం విచారకరమన్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆధార్ వ్యవస్థకు భద్రత కల్పించామన్నారు. ఆధార్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తే అదేరకమైన ఫలితాలుంటాయన్నారు.
‘ఇదంతా ఆధార్ వ్యవస్థకు అపఖ్యాతిపాలు చేసేందుకు వందశాతం పద్ధతిప్రకారం జరుగుతున్న దుష్ప్రచారం. ఆధార్ డేటా రక్షణకు ఎన్నో దశల భద్రత కల్పించాం. దీన్ని ఛేదించటం అంత సులభమేం కాదు’ అని అన్నారు. కాగా, ఆధార్ డేటా తస్కరణకు గురైందంటూ వస్తున్న వార్తలతో ఆందోళన వద్దని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం సూచించారు. ఢిల్లీలో జరిగిన 6వ వార్షిక అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో పాల్గొన్న మంత్రి.. ‘ఆధార్‌లో మీ మతం, సామాజికవర్గం, వైద్య, విద్య, ఆదాయ వివరాలేమీ ఉండవు. ఐరిస్, వేలిముద్రలు మాత్రమే ఉంటాయి. వందలకోట్లసార్లు ప్రయత్నించినా ఈ డేటాను చోరీ చేయలేరు. దేశంలో అత్యంత గోప్యమైన విషయాలు.. బ్యాంకు ఖాతాల వివరాలు, ఆరోగ్య వివరాలే’ అని రవిశంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment