'యూఎస్ పై ఆధారపడాల్సిన అవసరం లేదు'
లక్నో: చంద్ర, సూర్య గ్రహణాలతో పాటు తదితర జ్యోతిష్య సంబంధమైన విషయాలను తెలుసుకోవడానికి యూఎస్ గణితశాస్త్ర నిపుణులుపై ఆధారపడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.ఆ తరహా విషయాలను తెలుసుకోవడానికి భారతదేశంలో అనేకమంది జ్యోతిష్య పండితులు ఉన్నారని తెలిపారు.'మన జ్యోతిష్యం ఖచ్చితమైనది. ఇక్కడ(భారతదేశ) జ్యోతిష్య నిపుణల సామర్థ్యం అమోఘం. జ్యోతిష్య శాస్త్ర సంబంధమైన విషయాలను తెలుసుకోవడానికి అమెరికా సహకారం అవసరం ఏర్పడే అవకాశమే లేదు' అని రాజ్ నాథ్ పేర్కొన్నారు.
సోమవారం లక్నో యూనివర్శిటీ స్నాతకోత్సవానికి హాజరైన రాజ్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్య, చంద్ర గ్రహణాలకు సంబంధించి అమెరికా సహకారం తీసుకుంటున్నట్లు మన మీడియా చాలా సార్లు తప్పుదోవ పట్టించిందన్నారు. మన దగ్గర వంద ఏళ్ల నాటి హిందూ పంచాంగాలతో పాటు, రాబోవు వంద సంవత్సరాల పంచాంగాలు కూడా అందుబాటులో ఉన్నాయన్న సంగతిని మరువరాదని రాజ్ నాథ్ తెలిపారు.