మా ఆఫర్ ఇప్పటికీ ఉంది.. చూసుకోండి!
- ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ
- బీజేపీ ముందుకు వస్తే చర్చలకు సిద్ధమని ఉద్ధవ్ సంకేతాలు
- కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకూడదనే లేఖ రాశామని వెల్లడి
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరే అంశంపై శివసేన పార్టీలో ఊగిసలాట కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరతామని చెపుతూనే.. బీజేపీ ముందుకు వచ్చినట్లయితే ప్రభుత్వంలో చేరే దిశగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని శివసేన సోమవారం సంకేతాలిచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేసిన లేఖను శాసనసభ కార్యదర్శికి అందజేశామని, సేన శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్ షిండే పేరును ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని కోరామని శివసేన సీనియర్ నేత నీలమ్ గోర్హే విలేకరులకు తెలిపారు.
ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో శివసేన భాగస్వామి కాబట్టి తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని, అందువల్లే తాము ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసనసభ కార్యదర్శికి లేఖ రాసినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే.. తమకు ఎటువంటి అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. అధికార పంపకంపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు చెపుతున్నారని, వారు ముందుకు వచ్చినట్లయితే తాము చర్చలు జరిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ప్రకటించారు.
‘మహా’ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం
మహారాష్ట్ర శాసనసభ మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 12న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. కాషాయ తలపాగాలు ధరించి వచ్చిన శివసేన సభ్యులు ప్రతిపక్షాలకు కేటాయించిన బెంబీల్లో కూర్చున్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం కావడానికి ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సీనియర్ శాసనసభ్యుడు జీవ పండు గవిట్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు.
శాసనసభ సమావేశాలు ప్రారంభమైన అనంతరం గవిట్ కొత్త సభ్యులతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. బీజేపీ స్పీకర్ అభ్యర్థిగా ఔరంగాబాద్ ఎమ్మెల్యే హరిభావు బాగ్డేని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా రాధాకృష్ణ విఖే పాటిల్ ఎన్నికయ్యారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరచం: పవార్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ మైనారిటీ ప్రభుత్వాన్ని తాము అస్థిరపరచబోమని, అసెంబ్లీకి మళ్లీ వెంటనే ఎన్నికలు రాకుండా నివారించే లక్ష్యంతోనే ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు. అయితే, బలమైన ప్రతిపక్షంగానే తమ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ మైనారిటీ ప్రభుత్వాన్ని బలపరచాలన్న నిర్ణయం వెనుక బీజేపీతో తమకు రహస్య ఎజెండా ఏదీలేదని, ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ సమష్టిగా తీసుకున్న నిర్ణయం మాత్రమేనని పవార్ సోమవారం ముంబైలో విలేకరులకు చెప్పారు.