
'హేమతోపాటు నా కూతురుని తీసుకెళ్లాల్సింది'
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి, ఇటీవల్ రోడ్డు ప్రమాదానికి గురైన బీజేపీ నేత హేమమాలిని మరోసారి విమర్శల పాలయ్యారు. కారు ప్రమాదంలో రెండేళ్ల పాప చనిపోవడానికి ఆయన తండ్రే కారణమంటూ వ్యాఖ్యానించి ఆ తండ్రి ఆగ్రహానికి లోనయ్యారు. వారం కిందట రాజస్థాన్లోని దౌసా వద్ద హేమమాలిని రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె వెళుతున్న కారు వేగంగా దూసుకెళ్లి ఓ మారుతి ఆల్టో కారును ఢీకొనడంతో అందులోని చిన్నీ అనే రెండేళ్లపాప అసువులు బాయగా పాప తండ్రి, తల్లి, సోదరుడు కాళ్లకు, చేతులకు గాయాలై ఆస్పత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆ ప్రమాదానికి కారణం పాప తండ్రే కారణమని, ఆయన ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని, అందుకే పాప చనిపోయిందంటూ బుధవారం ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఘాటుగానే స్పందించారు.
'నేను నా కారు ఇండికేటర్ను ఆన్ చేసే ఉంచాను. ఆ సమయంలో రోడ్డు కూడా క్లియర్గా ఉంది. అప్పుడే నేను మలుపు తీసుకున్నాను. ఇందులో నేనేం ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా ఏం చేశాను? నేనేమైనా వేగంలో ఉన్నానా? అప్పుడు హేమమాలిని కారు గంటకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమెకు గొప్పపేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు. కానీ మాట్లాడేముందు ఓసారి ఆలోచించుకోవాలి. నా కారును వేగంగా వచ్చి ఢీకొట్టిన ఆమె (హేమమాలిని) డ్రైవర్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. నన్ను నిందించేందుకు బదులు.. ఆరోజు హేమమాలినితోపాటు నా కూతురును తీసుకెళ్లినా ఈ రోజు నేను చూసేందుకు బతికి ఉండేది' అంటూ బాధాతప్త హృదయంతో చెప్పారు. ఇదిలా ఉండగా, హేమమాలిని చర్యపై గతంలో విమర్శలు తలెత్తగా ఖండేవాల్ కుటుంబానికి సహాయం చేస్తామని హేమమాలిని కూతురు ఇషా డియోల్ ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని వారు చెప్పారు.