భారత్‌లో దొరికే రక్తంలో ఎందుకు ఎయిడ్స్‌? | over 2000 people infected with HIV after blood transfusion in past 17 months: NACO | Sakshi
Sakshi News home page

భారత్‌లో దొరికే రక్తంలో ఎందుకు ఎయిడ్స్‌?

Published Fri, Jun 3 2016 6:41 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

భారత్‌లో దొరికే రక్తంలో ఎందుకు ఎయిడ్స్‌? - Sakshi

భారత్‌లో దొరికే రక్తంలో ఎందుకు ఎయిడ్స్‌?

న్యూఢిల్లీ: భారత్‌లో రక్తమార్పిడి కారణంగా గత 17 నెలల కాలంలో 2,234 మందికి ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ వ్యాధి సోకినట్లు జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఎన్‌ఏసీఓ) బుధవారం నాడు ప్రకటించింది. రక్తదానం తీసుకునే ముందు దాతలకు ఎయిడ్స్‌ ఉందా, లేదా? అన్న విషయంలో సమగ్ర పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చెప్పుకుంటున్న దేశంలో ఇంత మందికి రక్తం ఎక్కించడం ద్వారా ఎయిడ్స్‌ మహమ్మారి సంక్రమించడం నిజంగా షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఇలా జరగడం లేదు.

మరి మన దగ్గర ఎక్కడ పొరపాటు జరుగుతోంది. రక్తం తీసుకోవడంలో బ్లడ్‌ బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయా, ఎలాంటి పరీక్షలు లేకుండానే వైద్యులు రక్తమార్పిడి చర్యలకు ఒడిగడుతున్నారా. ధనదాహం కోసం కొన్ని బ్లడ్‌ బ్యాంకులు కక్కుర్తి పడుతున్నాయా? టెక్నీషియన్లకు సాంకేతిక పరిజ్ఞానం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. భారత్‌లో అమలు చేస్తున్న రక్త విధానం నుంచి అన్ని చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయి. వీటిని అరికట్టనంతకాలం అమాయకులు ఎయిడ్స్‌ బారిన పడే ప్రమాదం లేకపోలేదు.

వాస్తవానికి ఎయిడ్స్‌ సోకిన రెండు, మూడు రోజుల్లో  రోగి రక్తంలో ఎయిడ్స్‌ ఉన్న విషయాన్ని కనుగొనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేదు. ఎయిడ్స్‌ సోకిన వారం రోజుల్లో  ఎయిడ్స్‌ను గుర్తించే రక్త పరీక్షలు ప్రపంచంతోపాటు భారత్‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పరీక్షకు అయ్యే ఖర్చు దష్ట్యా భారత్‌లో ఎక్కడ కూడా ఎయిడ్స్‌ను త్వరగా కనుగొనే ఈ పరీక్షను ఉపయోగించడం లేదు.

వారం రోజుల్లో ఎయిడ్స్‌ను కనుగొనేందుకు ‘న్యూక్లిక్‌ ఆసిడ్‌ ఆంప్లికేషన్‌ టెస్ట్‌’ను నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల ఓ యూనిట్‌ రక్తం ధర 2000 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు పెరుగుతుంది. భారత్‌లో ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకులు ఒక యూనిట్‌ రక్తాన్ని రూ. 1050, ప్రైవేట్‌ బ్యాంకులు రూ.1450కి మించి అమ్మకూడదని నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ పరిమితి విధించింది.

ప్రస్తుతం భారత్‌లో ‘ఎంజైమ్‌ లింకిడ్‌ ఇమ్యునోసార్బెంట్‌ ఆస్సే (ఈఎల్‌ఐఎస్‌ఏ)’ పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులోనూ నాలుగోతరం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల ఎయిడ్స్‌ సోకిన మూడు వారాల్లో గుర్తించవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని ఒక్క కర్ణాటక ప్రభుత్వం మినహా దేశంలో ఎక్కడా ఉపయోగించడం లేదు. త్వరలోనే ఈ విధానాన్ని తాము కూడా అమలు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించింది. దేశవ్యాప్తంగా మూడోతరం టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎయిడ్స్‌ సోకిన నాలుగు వారాల తర్వాతనే రోగాన్ని గుర్తించగలం.

కెనడాలో రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్‌ సోకిన సంఘటన 1985 నుంచి ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అమెరికాలో 2008 తర్వాత నమోదు కాలేదు. బ్రిటన్‌లో 2005లోనే ఆఖరి కేసు నమోదైంది. ఎయిడ్స్‌ సోకిన రెండు, మూడు రోజుల్లో రోగాన్ని కనుగొనే టెక్నాలజీయే ప్రపంచంలో లేనప్పుడు మరి ఆ దేశాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. ఆయా దేశాల్లో, ముఖ్యంగా కెనడాలో దాత నుంచి రక్తం తీసుకోవాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుంది. ముందు రోగికి కౌన్సిలింగ్‌ ఇస్తారు. ఇటీవల ఏమైన అస్వస్థతకు గురయ్యారా, లేదా? తెలుసుకుంటారు.

లైంగిక సంబంధాల గురించి క్షుణ్నంగా వాకబు చేస్తారు. వారు చెప్పినవన్నీ నిజాలేనని నిర్ధారించుకొని కూడా అఫిడవిట్‌ మీద సంతకం తీసుకుంటారు. అబద్ధం చెబితే శిక్షార్హులవుతారు. ఆ తర్వాతే దాత నుంచి రక్తం తీసుకుంటారు. మన దేశంలో పేరు, ఊరు, చిరునామా కలిగిన పత్రాలను కూడా సరిగ్గా రాయించుకోరు. మన దేశంలో ఎయిడ్స్, హెపటైటీస్‌ లాంటివి అరికట్టడం కోసం సుప్రీం కోర్టు ‘ప్రోఫెషనల్‌ డోనర్స్‌’ను నిషేధించినా లాభాల కోసం బ్లడ్‌ బ్యాంకులు వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. మరీ అత్యవసర పరిస్థితులోతప్ప రక్తమార్పిడిని అనుమతించవద్దని వివిధ దేశాల్లో చట్టాలున్నాయి. మన దగ్గర అలాంటివి లేవు. సమగ్ర రక్త విధానమే లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement