బోడినాయకనూర్ అడవుల్లో మంటలు
సాక్షి, చెన్నై / తేని: తమిళనాడులో ఘోరం జరిగింది. తేని జిల్లా బోడినాయకనూర్ అటవీప్రాంతంలో ఆదివారం అకస్మాత్తుగా కార్చిచ్చు చెలరేగడంతో ట్రెక్కింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న వారిలో నలుగురు సజీవ దహనమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి కార్చిచ్చులో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. తీవ్రమైన ఉష్ణోగ్రత ప్రభావంతో గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో మంటలు చెలరేగుతుండగా.. అటవీ అధికారులు అదుపుచేస్తూ వస్తున్నారు.
ఈ విషయమై తేని జిల్లా కలెక్టర్ పల్లవి బల్దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోడ్‌కు చెందిన 13 మంది, కోయంబత్తూర్‌కు చెందిన 24 మంది ట్రెక్కర్ల బృందం బోడినాయకనూర్ ప్రాంతంలోని కొజుకుమలై ప్రాంతానికి శనివారం చేరుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చెన్నై ట్రెక్కింగ్ క్లబ్ నిర్వహించిందన్నారు. వీరిలో ముగ్గురు పిల్లలు, 8 మంది పురుషులతో పాటు 26 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. కొజుకుమలైలోని ఓ ఎస్టేట్‌లో రాత్రి బసచేసిన అనంతరం తిరుగుప్రయాణం అవుతుండగా అడవిలో కార్చిచ్చు చెలరేగిందని పేర్కొన్నారు. దీంతో బెదిరిపోయి దట్టమైన గడ్డి ఉన్న ఇరుకైన ప్రాంతానికి చేరుకోవడంతో మంటలంటుకుని నలుగురు ట్రెక్కర్లు దుర్మరణం చెందినట్లు స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని భావిస్తున్నామన్నారు. ఈ ట్రెక్కింగ్‌కు వెళ్లినవారిలో పలువురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరికి 80 శాతం కాలిన గాయాలయ్యాయన్నారు. మరోవైపు ప్రమాద విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి.. సాయం చేయాల్సిందిగా రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరారు. దీంతో సీతారామన్ ఆదేశాలతో సులుర్ బేస్ నుంచి బయలుదేరిన రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లు అటవీ ప్రాంతంలో ట్రెక్కర్ల కోసం గాలింపు చేపట్టాయి. వీరిని రక్షించేందుకు సోమవారం ఆర్మీతో పాటు కేరళ, తమిళనాడు అటవీ అధికారులు రంగంలోకి దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment