అక్కడ..మధ్యాహ్న భోజనం హుళక్కే..
చంఢీఘర్ః పంజాబ్ లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజా నివేదికలు వెల్లడించాయి. బడి ఈడు పిల్లలను బడికి వచ్చేలా ప్రోత్సహించడం, పాఠశాలల్లో డ్రాపవుట్స్ ను తగ్గించడం, స్కూల్ పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన మిడ్ డే మీల్ స్కీమ్ (ఎండీఎంఎస్) ముఖ్యంగా చంఢీఘర్ లో కుంటుపడినట్లు కాగ్ నివేదికలు చెప్తున్నాయి.
అమృత్ సర్, లూథియానాల్లోని 32 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 50,417 పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు కావడం లేదని కాగ్ నివేదికలను బట్టి తెలుస్తోంది. పేద విద్యార్థులకోసం అమలు చేసే ఈ పథకంలో వంటకాలకు అయ్యే ఖర్చు 2010-15 సంవత్సరాలమధ్య సుమారు 810.82 కోట్ల రూపాయలు కాగా, అందులో 734.28 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేసినట్లు కాగ్ లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే అక్కడి మొత్తం 180 పాఠశాలను పరిశీలించగా వాటిలో 40 వరకూ స్కూళ్ళలో వంట ఖర్చులు సరిపోక మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదని కాగ్ తెలిపింది. ముఖ్యంగా ఎండీఎంఎస్ కోసం విడుదల చేసిన నిథులు ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని కాగ్ చెప్తోంది. 2010-15 మధ్య కాలంలో విడుదలైన 7.77 కోట్ల రూపాయల నిథులను జిల్లాస్థాయిలో జీతాలు, రవాణా, ఇతర అనుకోని ఖర్చులు చేసినట్లు కాగ్ పరిశీలనలో తేలింది.
2012-14 సంవత్సరాల్లో పాఠశాలలకోసం ప్రభుత్వం విడుదల చేసిన నిథుల్లో 41 లక్షల రూపాయల వరకూ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన కేంద్రాల్లోని కార్యాలయ భవనాల (పీఎస్ఈబీ భవనం) అద్దెలు, మరమ్మతులకు వినియోగించినట్లు కాగ్ లెక్కలు చెప్తున్నాయి. అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించే పోషకాహార వంటకాలకు సంబంధించిన వివరాలపై స్కూళ్ళు, జిల్లా స్థాయిలో కూడా ఎటువంటి రికార్డులు నిర్వహించటంలేదని కాగ్ తెలిపింది. మధ్యాహ్న భోజన పథకంలోని వంటకాల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు అందించే ఆహారంలో ప్రభుత్వ మార్గదర్శకాలను బట్టి 450 నుంచి 700 కేలరీలను, 12 నుంచి 20 గ్రాముల ప్రొటీన్లను చేర్చాల్సి ఉంది. కాగా 2013 ఆగస్టు, 2015 జనవరికి మధ్య ఎన్జీవోలు అందించిన ఆహార పదార్థాలను అధికారిక ప్రయోగశాలల్లో పరిశీలించగా సుమారు 1,41,523 మందికి నిబంధనలకు అనుగుణంగా ఆహారంలో పోషకాలను అందించలేదని కాగ్ వెల్లడించింది.