పిజ్జా డెలివరీ అంటేనే భయపడిపోతున్నారు
నోయిడా: సాధారణంగా దొంగలంటే డబ్బుకోసం, విలువైన వస్తువుల కోసం తెగబడుతుంటారు. కానీ, ఆహారపదార్థాలకోసం దొంగతనాలు మాత్రం చాలా అరుదు. దేశంలో దొంగతనాల ఘటనలకు పేరు నోయిడా. ఇక్కడ దొంగతనం పేరుతో వార్తా రాలేదంటే మాత్రం అది కచ్చితంగా రికార్డు అనుకోవాల్సిందే. ఎందుకంటే నోయిడాలో ప్రతి రోజు ఏదో ఒక చోట తప్పనిసరిగా దొంగతనం జరగడం.. అది పత్రికల్లో రావడం పరిపాటి. ఆయుధాలు ధరించి మరీ ఈ దొంగతనాలకు పాల్పడుతుంటారు.
అయితే, ఇక్కడ తాజాగా జరుగుతున్న దొంగతనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఇప్పుడు ఇక్కడ దొంగల కన్ను పిజ్జాలపై పడింది. అవును వారానికి కనీసం పదుల సంఖ్యలో పిజ్జాలను దొంగలు ఎత్తుకెళుతున్నారట. అయితే, దీనిని పెద్ద నేరంగా పరిగణించి ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోతుండటం గమనార్హం.
కచ్చితంగా ఎన్ని పిజ్జాల దొంగతనానికి గురవుతున్నాయనే విషయం చెప్పలేంగానీ వారానికి కనీసం పన్నెండుకు పైగా పిజ్జాలు మాయమవుతున్నాయని చెప్పగలం అని స్వయంగా పిజ్జా డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. తాము పిజ్జాలు తీసుకెళుతుండగా ఆయుధాలు ధరించి వచ్చి బెదిరించి పట్టుకెళుతున్నారని, అందుకే పిజ్జాలు డెలివరీకి తీసుకెళ్లాలంటేనే భయం వేస్తోందని అంటున్నారు.