రూ. 60 కోట్ల డబ్బు సీజ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో అక్రమంగా తరలిస్తున్న, దాచిన డబ్బును 60 కోట్ల రూపాయలకుపైగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసోంలో ఎన్నికలు పూర్తికాగా, పశ్చిమబెంగాల్లో రెండో విడత పోలింగ్ ముగిసింది. పశ్చిమబెంగాల్లో మరో నాలుగు విడతలతో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగాల్సివుంది.
ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తమిళనాడులో ఎక్కువ డబ్బును అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులో 24.55 కోట్లు, అసోంలో 12.33 కోట్లు, పశ్చిమబెంగాల్లో 12.14 కోట్లు, కేరళలో 10.41 కోట్లు, పుదుచ్చేరిలో 60.88 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేపడుతున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే మార్చి 4 నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో మరో నాలుగు విడతల్లో పోలింగ్ జరగాల్సివుండగా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఒకే విడతో మే 16న ఎన్నికలు నిర్వహించనున్నారు.