![Overwhelme says Delhi mango seller flooded by donations after loot - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/23/mango%20seller.jpg.webp?itok=jJcTD4ew)
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని పళ్ల వ్యాపారి ఫూల్ మియా చోటూ మరోసారి తన కళ్లను తానే నమ్మలేకపోతున్నాడు. దాదాపు రూ.30వేల విలువైన తన మామిడి పళ్లను దోచుకుపోయారని కన్నీటి పర్యంతమైన అతడు ఇపుడు ఆనందంతో కంటతడి పెట్టాడు. దోచేసే మనుషులతో పాటు, సాయం చేసే మహానుభావులు కూడా ఉన్నారని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. (సిగ్గు..సిగ్గు.. వీధి వ్యాపారిని దోచేసిన జనం!)
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో చోటూ బండి మీద పళ్లు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన దిగ్బ్రాంతికర ఉదంతంలో జనాలు మామిడి పళ్లను అందినకాడికి దోచుకుని వెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలా మంది దాతలు మానవత్వంతో స్పందించారు. దీంతో అతని బ్యాంకు ఖాతాలో దాదాపు రూ. 8లక్షలు జమ అయ్యాయి. దీనిపై చోటు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
‘పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా వుంది. ఇపుడిక సంతోషంగా ఈద్ పండుగ జరుపుకుంటాను.. బిడ్డలని చూసుకుంటా’నని చోటూ చెప్పాడు. అంతేకాదు తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపాడు. కొంతమంది కాని పనిచేసినా, చాలామంది మానవత్వంతో స్పందించడం ఆనందంగా వుందన్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) (కరోనా : భారీ సంపదనార్జించిన బిలియనీర్లు)
Comments
Please login to add a commentAdd a comment