'వారిపై జాలి కలుగుతోంది'
న్యూఢిల్లీ: రాజకీయ కుట్రలతోనే తన కుమారుడు కార్తీ చిదంబరంను వేధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అసలు టార్డెట్ తానేనని అన్నారు. కార్తీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. తన కుమారుడికి అక్రమ ఆస్తులు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తన కుమారుడిపై కొద్ది రోజుల క్రితం బాధ్యతారహితంగా తప్పుడు కథనం ప్రచురించిందని తెలిపారు. ఇది కల్పిత కథనమని మండిపడ్డారు. కార్తీ చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్నారని వివరించారు. ప్రతి ఏడాది ఆదాయపన్ను చెల్లిస్తున్నారని చెప్పారు. తన కుమారుడిపై ఆరోపణలు చేసిన వారిపై జాలి కలుగుతోందని వ్యాఖ్యానించారు. చివరకు సత్యమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎయిర్ సెల్-మాక్సిస్ వ్యవహారంలో కార్తీ చిదంబరం అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చిదంబరం స్పందించారు.