సైన్యం మెరుపుదాడుల తరువాత పాకిస్తాన్, భారత్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఒకవైపు భారత్ ఆరోపిస్తుండగా... మరోవైపు పాకిస్తాన్ ఎదురుదాడికి దిగింది. 13 ఏళ్ల క్రితం కుదుర్చకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని, 2016లో ఏకంగా 90 పర్యాయాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.
స్వీయవిధానాలే పాక్‌కు శాపం: ఎంఈఏ
బెనాలిం (గోవా): స్వీయ విధానాల కారణంగా పాకిస్తాన్ ఏకాకిగా మారిందని, దీంతో భారత్‌కు ఎటువంటి సంబంధమూ లేదని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన వాతావరణం కొరవడడంతో ఇస్లామాబాద్‌లో ఈ ఏడాది జరగాల్సిన సదస్సులో పాల్గొనకూడదని సార్క్ సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయన్నారు. ‘ఎవరైనా ఒంటరిగా మారారంటే అందుకు కారణం ఆ దేశం అనుసరించే విధానాలే. దాంతో భారత్‌కు ఎటువంటి సంబంధమూ లేదు. ఉగ్రవాదంతో కలుషితమైన వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరపడం సాధ్యం కాదని సభ్య దేశాలు ముక్తకంఠంతో చెప్పాయి’ అని అన్నారు.
భారత్ 90సార్లు ఉల్లంఘించింది: పాక్
ఇస్లామాబాద్: 13 ఏళ్లనాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్...90 పర్యాయాలు ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపించింది. ‘2016లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొంభైసార్లు ఉల్లంఘించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగిపోవాలి’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జక్రియా సోమవారం ట్వీటర్‌లో పేర్కొన్నారు. ‘ప్రాంతీయ శాంతికి భారతదేశమే ప్రధాన అడ్డంకి. పాకిస్తాన్ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం నిందా క్రీడ, ప్రతికూల ప్రకటనల వంటివాటికి పాల్పడుతోంది’ అని ఆరోపించారు. ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఏనాడూ ఉల్లంఘించలేదు. కాల్పుల ఉల్లంఘనలపై ప్రతిసారీ భారత్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది’ అంటూ సమర్థించుకున్నారు.
ఆగని మాటల తూటాలు
Published Mon, Oct 17 2016 9:20 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement
Advertisement