కరోనా వైరస్ ప్రపంచంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో సార్క్ దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రధాని నరేంద్రమోదీ సరైన సమయంలో చొరవ తీసుకోవడం ప్రశంసనీయం. దక్షిణాసియాలో కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధిని నిర్మూలించడంలో మోదీ తీసుకున్న చొరవ ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు కూడా. కానీ సార్క్‌ని తిరిగి పట్టాలెక్కించే విషయంలో అది హామీ కల్పించింది. మరోవైపున ప్రాంతీయ వేదికలపై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించకుండానే.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను మరిన్ని బాలాకోట్ ఘటనలు పునరావృతం చేయడం ద్వారా భారత్ శిక్షించవచ్చు. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా చైనా సాగిస్తున్న ప్రాంతీయ వ్యూహాత్మక ఆక్రమణను సవాలు చేయడానికి భారత్ తన పొరుగుకు ప్రాధాన్యతను ఇవ్వడం అనే విధానంలో భాగంగానే సార్క్‌ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమితి (సార్క్) పునరుత్తేజానికి, పునరుద్ధరణకు ప్రాణాంతక కోవిడ్–19 సాంక్రమిక వ్యాధి ఒకరకంగా మార్గం కల్పించింది. ప్రధాని నరేంద్రమోదీ కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టేందుకు ఒక పరస్పర సమన్వయ వ్యూహం కోసం సార్క్ దేశాల సహ ప్రధానులతో కలిసి పనిచేయడానికి సాహసోపేతమైన, సానుకూల చర్య విషయంలో చొరవ తీసుకున్నారు.
సార్క్ 2015 నుంచి ఐసీయూలో ఉంటూ వస్తోందన్నది తెలి సిందే. ప్రాంతీయ అనుసంధానంతో ముడిపడిన ప్రాజెక్టుల విషయంలో సహకారం అందించడానికి పాకిస్తాన్ తిరస్కరించడం, పాకిస్తాన్‌తో సంబంధాల కొనసాగింపునకు భారత్ నిరాకరించడమే దీనికి ప్రధాన కారణం. ప్రజారోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో పేలవమైన విధానాలు కొనసాగడం, మౌలిక వసతుల కొరతతోపాటు అధిక జనసాంధ్రతతో కూడిన దక్షిణాసియాలో కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధిని నిర్మూలించడంలో మోదీ తీసుకున్న చొరవ ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు కూడా. కానీ సార్క్‌ని తిరిగి పట్టాలెక్కించే విషయంలో అది హామీ కల్పించింది.
కోవిడ్–19 వ్యాధి నిర్మూలన కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను, సార్క్ అధినేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వాగతించారు. పాకిస్తాన్ కూడా దీంట్లో భాగమైంది. ఈ సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ తనవంతుగా కోటి అమెరికన్ డాలర్లను ఇస్తానని ప్రతిపాదించింది కూడా. సార్క్ దేశాల అధినేతలు తమ తమ దేశాల్లో వైరస్‌తో పోరాటంలో కలిసి పనిచేయడానికి, తమ అనుభవాలను, తాము సాగిస్తున్న ఉత్తమమైన విధానాలను పరస్పరం పంచుకోవడానికి అంగీకారం తెలిపారు. అంతే కాకుండా కరోనా వైరస్ దీర్ఘకాలంలో కలిగించనున్న ఆర్థిక, సామాజిక ప్రభావాలను ఉపశమింపజేయడానికి కూడా వీరు ఆమోదం తెలిపారు.
భారత్ నిజాయితీకి నిదర్శనం
భారత్ చేపట్టిన ఈ చొరవ వెనుక తన పొరుగుదేశాలకు అది ఇచ్చిన అప్రకటిత సందేశం చాలా స్పష్టంగా, గంభీరంగా ధ్వనించింది. అంతర్గతంగా కాకుండా బయటి ప్రపంచం నుంచి వచ్చి తమ మీద పడిన ఉత్పాతాలను ఎదుర్కోవడంలో సార్క్ దేశాలకు బాసటగా నిలుస్తానని భారత్ స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సమయంలో భారత్ నిజాయితీని, అది అందించే నిర్ణయాత్మక మద్దతును ఈ చొరవ నొక్కి చెప్పింది. ప్రపంచ శ్రేయస్సును పరిరక్షించడంలో తన వంతు బాధ్యతలను నెరవేర్చడానికి, అదే సమయంలో తనకున్న వనరులు, సమర్థతల పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తన సంసిద్ధత పట్ల కూడా భారత్ ప్రపంచానికి సందేశం ఇచ్చినట్లయింది.
విశ్వసనీయత కలిగిన ప్రపంచ శక్తిగా మారడంలో భారత్ నిబద్ధతను తన ఈ చొరవ స్పష్టంగా తెలియచెప్పింది. అదేసమయంలో మరో రెండు అంశాలలో తన వైఫల్యాన్ని కూడా భారత్ పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమైంది. ఒకటి: ఇరుగుపొరుగు దేశాలతో మొదట సఖ్యత సాధించడం అనే విదేశీ విధానాన్ని 2014లో ప్రధాని మోదీ అత్యంత ఉత్సాహంతో చేపట్టారు. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవడాన్ని తిరస్కరిస్తున్న పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడం. సార్క్ స్తంభించిపోవడానికి ఇదే కీలకమైన కారణం. రెండు: సార్క్ సదస్సును పాకిస్తాన్ 2016లో నిర్వహించాల్సి ఉండగా దాంట్లో పాల్గొనడానికి భారత్ తిరస్కరించింది.
పాక్‌ను ఒంటరి చేయడంలో వైఫల్యం
అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌ను ఒంటరిని చేయలేదు. పాకిస్తాన్‌కు ఇప్పటికీ చైనా సంఘీభావాన్ని తెలుపుతూనే ఉంది. కశ్మీర్ సమస్యను ఇస్లామిక్ దేశాల సంస్థ ఓఐసీ ఎజెండాగా ఉంచాలంటూ పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను సౌదీ అరేబియా ఆమోదించింది. వీటన్నిం టికీ మించి ఆప్ఘనిస్తాన్‌తో సహా అన్ని చోట్లా ఉగ్రవాద సంబంధిత అంశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికీ పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తూనే ఉంది. చివరకు ఇటీవల భారత్ పర్యటన సమయంలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ఆందోళనలకు దూరం జరిగారు. పైగా సీమాంతర ఉగ్రవాదంతో వ్యవహరించే శక్తిసామర్థ్యాలు భారతప్రధాని ఉన్నారని, అమెరికా 8 వేలమైళ్ల దూరంలో ఉన్నందున ఇతర ప్రాంతీయ దేశాలు ఈ అంశంలో భారత్‌కు తగిన సహాయసహకారాలు అందించాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు ట్రంప్.
ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలోనే ట్రంప్ పాకిస్తాన్ ప్రధానిని బహిరంగంగా ప్రశంసించడం, ప్రాంతీయ శాంతి, సుస్థిరతపై కృషి చేయాలంటూ ట్రంప్ భారత్‌కు పిలువునివ్వడం అనేది చమత్కారంతో కూడిన జిత్తులమారితనం తప్ప మరేమీకాదు. పైగా పాకిస్తాన్‌తో సంభాషించకపోవడం ద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనుకున్న భారత విధానం పట్ల అమెరికా చివాట్లు పెట్టినట్లే లెక్క. పైగా పాకిస్తాన్‌ను సాకుగా చూపుతూ సార్క్‌ను ప్రతిష్టంభనకు గురిచేయడం ఎవరి ప్రయోజనాలనూ నెరవేర్చదని చెప్పాలి.
పొరుగుకు ప్రాధాన్యత ఫలిస్తోందా?
మరొక అంశం ఏమిటంటే, బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ పేరిట బహుళ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకార వ్యవస్థ (బిమ్‌స్టెక్)ను నిర్మించడంలో భాగంగా భారత్ పొరుగుకు ప్రాధాన్యత అనే విధానాన్ని ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చింది. ఇది కచ్చితంగా సార్క్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పథకం అనే చెప్పాలి. భారత సముద్ర ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధకతతోసహా పలు రంగాల్లో ఈ బిమ్‌స్టెక్‌ను భారత్ క్రియాశీలకంగా ప్రోత్సహిస్తూ, బలోపేతం చేస్తూ వచ్చింది. కానీ ఈ విధానంలోనూ కొన్ని పరిమితులు ఉన్నాయని భారత విధాన నిర్ణేతలు క్రమంగా గ్రహిస్తూ వచ్చారు.
ఎందుకంటే థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కూడా చైనాకు సన్నిహితం అయ్యాయి. పైగా నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు కూడా చైనాతో విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమవుతూనే భారత, చైనా మధ్య సమతుల్యతను పాటించే ఎత్తుగడలను అవలంభించడంలో తలమునకలవుతున్నాయి. వీటిలో కొన్ని దేశాలు కోవిడ్–19తో పోరాడటంపై సార్క్ సదస్సు విషయంలో కూడా మృదువుగానే చైనాను రంగంలోకి తీసుకురావడానికి వెనుకాడలేదు.
దూరమవుతున్న పొరుగు దేశాలు
భారత్–పాకిస్తాన్ మధ్య పెనవేసుకున్న ఈ ద్విబంధనం సార్క్‌కు మాత్రమే హాని చేయడం లేదు. భారత్‌కు సమీపంలో ఉన్న పొరుగుదేశాలు కూడా ప్రాంతీయ సమగ్రతా ప్రతిపాదనల పట్ల చాలా జాగరూకతతో వ్యవహరిస్తున్నాయి. పైగా భారత్‌తో సన్నిహితంగా ఉండటం అంటే మరీ సన్నిహితంగా ఉండటమా అనే అంశాన్ని కూడా ఈ దేశాలు తేల్చుకోలేక పోతున్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ (బీబీఐన్) దేశాల మధ్య ఉప ప్రాంతీయ ప్రోత్సాహక చర్యలు నెమ్మదిగా సాగుతున్న విషయం దీన్నే తేల్చిచెబుతోంది.
ఈ నేపథ్యంలో సార్క్ దేశాల సహకార సమితిని పునరుద్ధరించడం వైపుగా భారత్ సరైన చర్యను చేపట్టింది. ప్రాంతీయ ప్రాజెక్టులలో భాగం కావడానికి తిరస్కరించడం ద్వారా పాకిస్తాన్ తనకు తానే ఒంటరి అయితే కానివ్వండి. భారత ప్రధాని చొరవతో తలపెట్టిన కోవిడ్–19 వీడియో కాన్ఫరెన్స్‌కు దిగువస్థాయి అధికారులతో కూడిన ప్రాతినిధ్య బృందాన్ని పంపించడం ద్వారా పాకిస్తాన్ తన సంకుచిత బుద్ధిని తనకు తానుగా ప్రదర్శించుకుంది.
పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్
పైగా తగుదునమ్మా అటూ కరోనా వైరస్ నిరోధక చర్యల కోసం తలపెట్టిన ఆ వీడియో కాన్ఫరెన్సులో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తినా ఇతర భాగస్వామ్య దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ఆప్ఘనిస్తాన్ సరిహద్దులను పాకిస్తాన్ మూసివేయడంపై ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని నేరుగా పాకిస్తాన్‌నే ప్రశ్నిస్తూ ఢిఫెన్స్‌లో పడేశారు.
మరోవైపున ప్రాంతీయ వేదికలపై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించకుండానే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను మరిన్ని బాలాకోట్ ఘటనలు పునరావృతం చేయడం ద్వారా భారత్ శిక్షించవచ్చు. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా చైనా సాగిస్తున్న ప్రాంతీయ వ్యూహాత్మక ఆక్రమణను సవాలు చేయడానికి భారత్ తన పొరుగుకు ప్రాధాన్యతను ఇవ్వడం అనే విధానంలో భాగంగానే సార్క్‌ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త: ఎస్‌డి ముని, ప్రొఫెసర్ ఎమిరేటస్, జేఎన్‌యూ,
భారత మాజీ రాయబారి, భారత ప్రభుత్వ ప్రత్యేక దూత
Comments
Please login to add a commentAdd a comment