ప్రతి పల్లెలోనూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ | Royal Enfield in every village says Business Head Jaya Pradeep | Sakshi
Sakshi News home page

ప్రతి పల్లెలోనూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

Published Thu, Aug 25 2022 5:28 AM | Last Updated on Thu, Aug 25 2022 8:52 AM

Royal Enfield in every village says Business Head Jaya Pradeep - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. పేరుకు తగ్గట్టే హుందా ఉట్టిపడే ఈ మిడ్‌ సెగ్మెంట్‌ బైక్స్‌కు ఇప్పుడు దేశంలో ప్రతీ పల్లెలోనూ కస్టమర్‌ ఉన్నారు. భారత్‌లో ఏటా కంపెనీ సుమారు 6,00,000 వాహనాలను విక్రయిస్తోంది. ఇందులో 60 శాతం యూనిట్లు ప్రధాన నగరాల్లో అమ్ముడవుతుండగా మిగిలిన 40 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదార్లకు చేరుతున్నాయని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇండియా, సార్క్‌ బిజినెస్‌ హెడ్‌ వి.జయప్రదీప్‌ తెలిపారు. 75 శాతం విక్రయ కేంద్రాలు మెట్రోయేతర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 10 శాతం ఉందని వివరించారు. హైదరాబాద్‌ మార్కెట్లో హంటర్‌ 350 బైక్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సాక్షి బిజినెస్‌ బ్యూరోతో ఆయన మాట్లాడారు.  

స్టూడియో ఫార్మాట్‌లో..
సంస్థకు దేశంలో 2,150 విక్రయశాలలు ఉన్నాయని జయప్రదీప్‌ వెల్లడించారు. ‘ఇందులో పట్టణాలు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లను దృష్టిలో పెట్టుకుని స్టూడియో ఫార్మాట్‌లో సగం స్టోర్లను తెరిచాం. 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. మూడేళ్లలోనే స్టూడియోల సంఖ్య 1,075కు చేరుకుందంటే మెట్రోయేతర ప్రాంతాల్లో బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్‌ అర్థం చేసుకోవచ్చు. అమ్మకాల వృద్ధి 50 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతంలో ఇది ఏకంగా 60 శాతం ఉంది. ఎనిమిది మోడళ్లలో నాలుగు 350 సీసీ సామర్థ్యం గలవి. విక్రయాల్లో  350 సీసీ మోడళ్ల వాటా అత్యధికంగా 80 శాతం ఉంది. 250–750 సీసీ మిడ్‌ సెగ్మెంట్లో దేశంలో అన్ని కంపెనీలవి కలిపి నెలకు 60,000 బైక్స్‌ అమ్ముడవుతున్నాయి. ఇందులో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు 85 శాతం వాటా ఉంది’ అని ఆయన వివరించారు.  

నెలకు రూ.4,999లతో..
హంటర్‌ను 349 సీసీ ఎయిర్‌ ఆయిల్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ జె-సిరీస్‌ ఇంజన్‌తో రూపొందించారు. 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్, డిస్క్‌ బ్రేక్స్, డ్యూయల్‌ చానెల్‌ ఏబీఎస్, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్, ప్రీమియం డిజిటల్‌ అనలాగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ పొందుపరిచారు. బరువు 181 కిలోలు. వేరియంట్‌నుబట్టి హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంలో ధర రూ.1,49,900 నుంచి ప్రారంభం. 8రంగుల్లో లభిస్తుంది. నెల వాయిదా రూ.4,999లతో హంటర్‌ను సొంతం చేసుకోవచ్చు. వాయిదా పద్ధతిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య 55% ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement