భారత్కు పాకిస్థాన్ వెన్నుపోటు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి భారత్పై తన అక్కసును బయటపెట్టింది. ఓ పక్కసోదరభావంతో మెలుగుదామని చెబుతూనే సరిగ్గా వెన్నుపోటు పొడిచామని బహిరంగంగా ప్రకటించింది. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కు విదేశీ వ్యవహారాలపై సలహాలు సూచనలు ఇచ్చే సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ అన్ని విధాల కృషి చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్ఎస్జీలో సభ్య దేశాలన్నీ కూడా ఇందుకు ఒప్పుకున్నాయి. అయితే, చైనా రూపంలో భారత్కు గట్టి సమస్య ఎదురైంది.
భారత్కు సభ్యత్వం ఇస్తే.. పాకిస్థాన్కు కూడా సభ్యత్వం ఇవ్వాల్సిందేనని చైనా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, చైనా ఈ ప్రకటన చేయడానికి వెనుక పాక్ ఉన్నట్లు స్పష్టమైంది. పాక్ పార్లమెంటులో అజీజ్ మాట్లాడుతూ'ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందకుండా ఉండేందుకు భారత్ను సమర్థంగా కట్టడి చేశాం' అని అన్నారు. వివక్షలేకుండా, మెరిట్ ఆధారంగా మాత్రమే ఎన్ఎస్జీలో సభ్వత్వం ఇవ్వాలని తాము డిమాండ్ చేసినట్లు చెప్పారు.
ఎన్ఎస్ జీ విషయంలో భారత్ ను అడ్డుకునేందుకు వీలయినంతగా కృషిచేసి విజయం సాధించామని అన్నారు. త్వరలో ఎన్ఎస్జీ సభ్య దేశాలు భేటీ అవనున్న నేపథ్యంలో అజీజ్ చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా, భారత ప్రధాని నరేంద్రమోదీ ముస్లిం దేశాల్లో పర్యటించిన మాత్రానా ఆ దేశాలతో పాకిస్థాన్కు సంబంధాలు బలహీనం కాబోవని, భాషా, మతం, సంస్కృతివంటి విషయాలతో పోలిస్తే అందరం ఒకటే అని అన్నారు.