పాక్ ఆ ప్రాంతాలు విడిచి వెళ్లాల్సిందే: భారత్
న్యూఢిల్లీ: ఆక్రమిత కశ్మీర్ భూభాగం, గిల్గిత్ బాల్తిస్థాన్ భూభాగం నుంచి పాకిస్థాన్ వెళ్లిపోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఎన్నో ఏళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యకు ఇదే కారణమని చెప్పింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ అక్రమంగా ఏయే ప్రాంతాలను ఆక్రమించుకుందో వాటన్నింటిని వదిలేసి వెళ్లిపోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
కశ్మీర్ ప్రజల కోరుకుంటున్నట్లుగా ఆ సమస్యకు పరిష్కారం చూపే తీర్మానానికి తాను అనుకూలం అంటూ పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ప్రకటించిన నేపథ్యంలో దానికి కౌంటర్‌గా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ విషయంలో భారత్, పాక్ మధ్య ఏదైనా సమస్య ఉందంటే అది ఒక్క పాక్ అక్రమంగా ఆక్రమించినదాని గురించే. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం కావచ్చు. గిల్గిత్ బాల్తిస్థాన్ కావచ్చు. పాక్ అక్రమించిన భూభాగానికి తిరిగి ఎలా స్వాతంత్ర్యం ఇప్పించాలన్నది, తిరిగి భారత భూభాగంలో ఎలా కలపాలన్నదే ఇప్పుడు ప్రధానమైన అంశం’ అని ఆయన నొక్కి చెప్పారు.