
గిల్గిట్: పాకిస్తాన్‌లో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో చిన్నారి సహా 10 మంది సజీవ సమాధి కాగా, మరో 25 మంది గాయపడ్డారు. ఆక్రమిత కశ్మీర్‌లోని కెల్ ప్రాంతంలోని సంచార గిరిజనులు మేకలను మేపుకుంటూ పక్కనే గిల్గిట్–బల్టిస్తాన్ ప్రాంతంలోని ఎస్తోర్‌కు వెళ్లారు.
శనివారం తిరిగి వస్తుండగా షౌంటర్ పాస్‌లోని చంబేరి వద్ద వారిపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు, నాలుగేళ్ల బాలుడు సహా 10 మంది చనిపోయారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. అననుకూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.