living tomb
-
మంచుచరియల కింద సజీవ సమాధి
గిల్గిట్: పాకిస్తాన్లో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో చిన్నారి సహా 10 మంది సజీవ సమాధి కాగా, మరో 25 మంది గాయపడ్డారు. ఆక్రమిత కశ్మీర్‌లోని కెల్ ప్రాంతంలోని సంచార గిరిజనులు మేకలను మేపుకుంటూ పక్కనే గిల్గిట్–బల్టిస్తాన్ ప్రాంతంలోని ఎస్తోర్‌కు వెళ్లారు. శనివారం తిరిగి వస్తుండగా షౌంటర్ పాస్‌లోని చంబేరి వద్ద వారిపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు, నాలుగేళ్ల బాలుడు సహా 10 మంది చనిపోయారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. అననుకూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. -
పాక్‌లో ఘోరం.. మంచు కింద 22 మంది సజీవ సమాధి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భారీగా కురుస్తున్న మంచు, మైనస్ 8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సహా మొత్తం 22 మందిని బలి తీసుకున్నాయి. మృతుల్లో 10 మంది చిన్నారులున్నారు. ఇస్లామాబాద్‌కు 28 మైళ్ల దూరంలోని ప్రముఖ కొండప్రాంత రిసార్టు పట్టణం ముర్రీలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం ముర్రీకి పోటెత్తడంతో శుక్రవారం రాత్రి వేలాదిగా వాహనాలు ఆ దారిలో చిక్కుకుపోయాయి. తీవ్రంగా మంచు కురుస్తుండటం, ఉష్ణోగ్రతలు –8 డిగ్రీలకు పడిపోవడంతో చాలా మంది ఎటూ కదల్లేక వాహనాల్లోనే ఉండిపోయారు. చలికి గడ్డకట్టుకుపోయి ఇస్లామాబాద్‌కు చెందిన పోలీస్ అధికారి నవీద్ ఇక్బాల్ సహా ఆయన కుటుంబంలోని 8 మందితోపాటు మొత్తం 22 మంది వాహనాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నాలుగడుగుల మేర కురిసిన మంచులో వెయ్యి వరకు వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. శనివారం సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్తగా ముర్రీకి వెళ్లే రహదారులను ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసివేసినట్లు వెల్లడించారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. -
సజీవ సమాధి అవుతా!
తమిళనాడు, టీ.నగర్: అత్తికడవు– అవినాశి పథకాన్ని వెంటనే పూర్తిచేయాలని లేదంటే సజీవ సమాధి పోరాటం చేస్తానంటూ ఓ మహిళ హెచ్చరించింది. వివరాలు.. చెన్నై అన్నానగర్ వెస్ట్ ప్రాంతానికి చెందిన నందకుమార్ భార్య, సామాజిక సేవకురాలైన నర్మద (39) గురువారం అవినాశి కొత్త బస్టాండు ఎదురుగా నేలపై పడుకుని ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆమెతో చర్చలు జరిపారు. అత్తికడవు– అవినాశి పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని.. పోరాటం విరమించాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత మహిళ ఆందోళన విరమించింది. నర్మద విలేకరులతో మాట్లాడుతూ 60 ఏళ్లుగా తిరుపూర్, కోయంబత్తూరు, ఈరోడ్ జిల్లా ప్రజలు అత్తికడవు పథకం కోసం పోరాడుతున్నారన్నారు. ఈ పథకం అమలుకు ముందు మాజీ ముఖ్యమంత్రికి రూ.50 కోట్లతో స్మారకమండపం నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. -
తల్లి శవం పక్కనే.. కుమార్తె సజీవ సమాధి
కాల్వశ్రీరాంపూర్, న్యూస్‌లైన్: తల్లి మృతి చెందడంతో కడసారి చూపు కోసం పరుగున వచ్చిన కుమార్తె అక్కడ రోదిస్తుండగానే... గోడకూలి తల్లి శవం పక్కనే సజీవ సమాధి అయింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లెకి చెందిన పొవారి రాయమల్లమ్మ(85)అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. వరంగల్ జిల్లా మొగుల్లపల్లి మండలం చింతలపల్లె గ్రామంలో ఉంటున్న కుమార్తె రాధమ్మ తల్లిని కడసారి చూసుకునేందుకు రాత్రికి ఆరెపల్లెకు చేరుకుంది. శుక్రవారం ఉదయం రాయమల్లమ్మ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకు మృతదేహం పక్కనే కూర్చున్న వారందరూ లేచి ముందుకు వచ్చారు. రాధమ్మ తల్లి మృతదే హం పక్కనే రోదించసాగింది. పక్కనే ఉన్న సిమెంట్ గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో రాధమ్మ ఆ గోడ శిథిలాల కింద ఇరుక్కుపోయింది. తీవ్రగాయాలై ఊపిరాడకపోవడంతో శిథిలాలను తొలగించేలోపే ఆమె చనిపోయింది. సిమెంట్ గోడ అవతలివైపు ఇసుక పోశారు. ఇటీవల వర్షాలకు ఇసుక తడిసి బరువెక్కింది. దీంతో గోడ ఒక్కసారిగా కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే తల్లీబిడ్డలు మృతి చెందడంతో విషాదం అలుముకుంది.