
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో భారీగా కురుస్తున్న మంచు, మైనస్ 8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సహా మొత్తం 22 మందిని బలి తీసుకున్నాయి. మృతుల్లో 10 మంది చిన్నారులున్నారు. ఇస్లామాబాద్‌కు 28 మైళ్ల దూరంలోని ప్రముఖ కొండప్రాంత రిసార్టు పట్టణం ముర్రీలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం ముర్రీకి పోటెత్తడంతో శుక్రవారం రాత్రి వేలాదిగా వాహనాలు ఆ దారిలో చిక్కుకుపోయాయి. తీవ్రంగా మంచు కురుస్తుండటం, ఉష్ణోగ్రతలు –8 డిగ్రీలకు పడిపోవడంతో చాలా మంది ఎటూ కదల్లేక వాహనాల్లోనే ఉండిపోయారు.
చలికి గడ్డకట్టుకుపోయి ఇస్లామాబాద్‌కు చెందిన పోలీస్ అధికారి నవీద్ ఇక్బాల్ సహా ఆయన కుటుంబంలోని 8 మందితోపాటు మొత్తం 22 మంది వాహనాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నాలుగడుగుల మేర కురిసిన మంచులో వెయ్యి వరకు వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. శనివారం సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్తగా ముర్రీకి వెళ్లే రహదారులను ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసివేసినట్లు వెల్లడించారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment