సిక్కింలో 158 మంది జవానులు హతం: పాక్ మీడియా
న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులో 158 మంది భారత జవానులు మరణించారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. సోమవారం చైనా రాకెట్లతో సిక్కిం సరిహద్దులో దాడి చేసిందని చెప్పింది. ఈ ఘటనలో 158 మంది భారత జవానులు అమరులయ్యారని తెలిపింది. చైనాతో సిక్కిం సరిహద్దులో వివాదం ఉన్న సమయంలో పాకిస్తాన్ మీడియా ఈ వార్తను ప్రచురించడంతో అది వైరల్‌గా మారింది.
పాక్ మీడియాలో వస్తున్న కథనంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అవన్నీ నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మరో దేశ మీడియా ఇలాంటి వార్తలను ప్రచురించడం గర్హనీయమని మండిపడింది.
దీనిపై మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే.. ఇలాంటి కథనాలను బాధ్యత గల మీడియా ప్రచురించదని అన్నారు. భారత్‌పై దుష్ప్రచారం చేసేందుకే పాకిస్తానీ మీడియా ఇలాంటి అవాస్తవ కథనాలను వండుతోందని వ్యాఖ్యానించారు.