40 భారత చెక్పోస్టులపై పాకిస్థాన్ కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తోంది. జమ్ము కాశ్మీర్లోని సాంబ జిల్లాలో పాక్ బలగాలు ఏకంగా 40 సరిహద్దు చెక్పోస్టుల మీద కాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ దళాలు ఎప్పటికప్పుడు రెచ్చిపోతున్నా, బీఎస్ఎఫ్ బలగాలు కూడా భారీగా వాళ్లమీద విరుచుకుపడటంతో పెద్ద నష్టమే తప్పింది. అయితే ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు చాలాసేపు కొనసాగుతూనే ఉన్నాయి.
పాక్ రేంజర్లు చిన్న, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు ప్రారంభించి, దాదాపు 35-40 చెక్పోస్టులు, పౌరుల నివాసాలపై మోర్టారు బాంబులు కూడా వేశారు. ఈ దాడి ఆదివారం రాత్రి 9.30 నుంచి మొదలై సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. సాంబా జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇదే మొదటిసారి. ఆర్నియా, ఆర్ పురా, కానాచక్, అఖ్నూర్ సబ్సెక్టార్లను పాక్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినా, బాంబు దాడి వల్ల ముగ్గురు పౌరులు మాత్రం గాయపడ్డారు. గడిచిన 15 రోజుల్లోనే 21 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.