అవును.. మా సైన్యం చావుదెబ్బ తింది: పాక్ పోలీసు
తమ ఉన్నతాధికారితో మాట్లాడుతున్నానని భావించిన పాకిస్థానీ పోలీసు అధికారి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన వాస్తవాన్ని తన నోటితోనే వెల్లడించాడు. పాక్ సైనికుల్లో కూడా ఐదుగురు మరణించారని వెల్లడించాడు. భారత దేశానికి చెందిన ఒక జాతీయ మీడియా చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. ఐజీ ముస్తాక్ పేరుతో గులాం అక్బర్‌కు పాత్రికేయుడు మనోజ్ గుప్తా ఫోన్ చేశారు. ''సర్.. అది రాత్రి సమయం. సుమారు 3 నుంచి 4 గంటల వరకు పట్టింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరిగింది. అప్పటివరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి'' అని అక్బర్ ఫోన్లో చెప్పారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ ఆ దాడుల గురించి మొత్తం వివరాలన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో దిక్కు తోచలేదని.. దాంతో ఐదుగురు సైనికులు మరణించారని కూడా ఆయన వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను కూడా పాక్ సైన్యం వెంటనే అక్కడినుంచి తొలగించిందని, అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం తెలియదని గులాం అక్బర్ అన్నారు. దాడులు జరిగిన ప్రాంతాల పేర్లు కూడా తెలిపారు. ఫలానా ప్రాంతాల్లో దాడులు జరిగాయంటూ ఎస్పీ అక్బర్ చెప్పిన ప్రాంతాలన్నీ ఇంతకుముందు తాము దాడులు చేసినట్లుగా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పిన ప్రాంతాలేనని కూడా తేలింది.
సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థానీ సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిందని చెబుతూ.. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తోందని కూడా ఆయన వివరించారు. 'ఆర్మీయే వాళ్లను తీసుకొస్తుంది.. అది వాళ్ల చేతుల్లోనే ఉంది' అని అన్నారు. జీహాదీల విషయాలను స్థానిక పోలీసులకు కూడా తెలియనివ్వకుండా పాక్ సైన్యం కాపాడుతుంది కాబట్టి ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం తనకు తెలియదని అన్నారు.