పీకల్లోతు మునిగిన పంకజ
ముంబై: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు మునిగి పోయారు. ఏప్రిల్ నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, ఆదరాబాదరాగా ఫిబ్రవరి 13వ తేదీన ఏకంగా 230 కోట్ల రూపాయల టెండర్లను 24 జీవోల ద్వారా కేటాయించారు. ఈ అన్ని జీవోలపైనా ఒక్క రోజే సంతకం చేయడం గమనార్హం. ఈ కాంట్రాక్టులు దక్కించుకున్న వారిలో కొన్ని మహిళా సంఘాలు ఉన్నాయి. కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ఉత్పత్తిదారుల బినామీలు ఉన్నారు. కాంట్రాక్టులు పొందిన వారిలో పాలకపక్ష బీజేపీ స్థానిక నేతలు ఉన్నారు. అవినీతిలోనూ సమాన న్యాయం అన్న నీతిని పాటించినట్టు ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రజ్ఞా పరాబ్ నాయకత్వంలోని 'సూర్యకాంత్ మహిళా ఔద్యోగిక్ సహకారి సంస్థ'కు ఏకంగా 104 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు అప్పగించారు. ఈ మహిళా సంస్థ ఏడాది టర్నోవర్ 300 కోట్ల రూపాయలపైనే. మిగతా మహిళా సంఘాల్లో ఎక్కువ మంది బీజేపీ మహిళా నేతలు లేదా నేతల భార్యలే ఉన్నారు. గర్భిణీ స్త్రీలు, శిశువులను పౌష్టికాహారాన్ని సరఫరా చేయడంతో పాటు వంట పాత్రలు, వాటర్ ఫిల్టర్లు సరఫరా చేసేందుకు రూ. 230 కోట్ల కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి పథకం (ఐసీడిఎస్) కింద దేశంలోని అంగన్‌వాడీ పిల్లలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహార పథకంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే విషయం ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కింద తన దృష్టికి రావడంతో సుప్రీం కోర్టు 2004లోనే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఐసీడీఎస్ కింద పౌష్టికాహారాన్ని సరఫరా చేసే కాంట్రాక్టులు వ్యాపారవేత్తలకు ఇవ్వరాదని, స్థానిక ప్రజాసంఘాలు, ఆర్థిక వనరులు మరీ ఎక్కువగా లేని మహిళా సంఘాలు, స్వయం పోషక సంఘాలకు అప్పగించాలని, అట్టడుగు వర్గాల మహిళల నాయకత్వంలోని మహిళా సంఘాలకు మాత్రమే ఇవ్వాలని, స్థానిక సరకు ఉత్పత్తిదారులకు ఇవ్వొచ్చని, అవి కూడా ఒకే సంఘానికి కాకుండా తాము సూచించిన సంఘాల్లో కనీసం ఐదు సంఘాలకు కాంట్రాక్టులు అప్పగించాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఇలా చేయడం వల్ల అంగవాడీలకు రేషన్ సరఫరా సక్రమంగా ఉండటమే కాకుండా స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడింది.
ఈ సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఎప్పటి నుంచో తుంగలో తొక్కుతూ వస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో ఐసీడీఎస్ స్కీమ్‌లోకి కాంట్రాక్టర్లను కూడా చేరుస్తూ కొత్త సవరణ తీసుకొచ్చింది. మహారాష్ట్రలోని 'వేంకటేశ్వర మహిళా ఔద్యోగిక్ ఉత్పాదన్ సబకారి సంస్థ లిమిటెడ్, మహాలక్ష్మీ మహిళా గృహోద్యోగ్ అండ్ బాలవికాస్ బుద్దేశియా ఔద్యోగిక్ సంస్కారి సంస్థ, మహారాష్ట్ర మహిళా సహకారి గృహుద్యోగ్ సంస్థ లిమిటెడ్' లాంటి మహిళా సంఘాల పేర్లు వింటుంటే ఇవి ఏ ఉద్దోశంతో పుట్టుకొచ్చాయో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పంకజా ముండేపైనే కాకుండా ఆమె తండ్రి, మాజీ మంత్రి దివంగత నాయకుడు గోపీనాథ్ ముండేపై కూడా గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన సన్నిహితుడైన సతీష్‌రావు ముండేకు చెందిన స్వప్నిల్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సబ్‌లీజ్ కింద ఐసీడీసీ కింద కాంట్రాక్టును దక్కించుకుంది. సతీష్‌రావు భార్య వనమాల ముండే నాయకత్వంలోని మహిళా సంఘానికి ప్రధాన కాంట్రాక్టు లభించింది. ఈ కారణంగా గోపీనాథ్ ముండే అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.
కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి కింద గర్భవతులైన తల్లులకు, ఆరేళ్ల వయస్సు వరకు ఉండే పిల్లలకు పౌష్టికాహారాన్ని సరఫరా చేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1975లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ పథకాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు.