న్యూఢిల్లీ: దేశంలోని పలు సరిహద్దు ప్రాంతాల పర్యటనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటి సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వచ్చే నెలలో పర్యటించనుంది. 31 మంది సభ్యుల గల కమిటి ఈ పర్యటనకు వెళ్లనుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా,పలువురు సీనియర్ నేతలు దీనిలో పాల్గొననున్నారు. వివాదస్పద డోక్లాం ప్రాంతంలో కూడా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. డోక్లాం వివాదంతో భారత్-చైనా మధ్య గత కొంతకాలం యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
డోక్లాం ప్రాంతంలో భారత్- చైనా సైనిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వివాదానికి కారణం ఏంటి అనే అంశాలను ఈ కమిటి పరిశీలించనుందని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఏరియల్ వ్యూ కోసం ప్రత్యేక చాపర్‌ను ఉపయోగించనున్నారు. డోక్లాం ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డుకు భారత్ అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా-భూటాన్ మధ్యకూడా సరిహద్దు వివాదం ఉంది. డోక్లాం విషయంలో భూటాన్ మొదటి నుంచి భారత్‌కు అనుకూలంగానే ఉంది. గతంలో డోక్లాం వివాదంపై భారత విదేశాంగ అధికారులను రాహుల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా సృష్టిస్తున్న వివాదంపై చైనా అధికారులతో రాహుల్ గతంలో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment