Doklam dispute
-
డోక్లాంలోకి మళ్లీ చైనా
వాషింగ్టన్: డోక్లాం ప్రాంతంలోకి చైనా మరోసారి చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని ఇటు భారత్, భూటాన్ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది. గురువారం ఈ మేరకు అమెరికా ఉన్నతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై చైనా అక్రమంగా కృత్రిమ ద్వీపాలు నిర్మాణంపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ జరిగిన సందర్భంగా దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అలైస్ వెల్స్ మాట్లాడారు. భారత్ సరిహద్దులో రోడ్ల నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసిందన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు అన్ వాగ్నర్ మాట్లాడుతూ ‘డోక్లాం వివాదం సద్దుమణిగిన తర్వాత చైనా నెమ్మదిగా డోక్లాంలో తన కార్యకలాపాలను పునరుద్ధరించింది. ఈ విషయంపై భూటాన్, భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. హిమాలయ ప్రాంతంలో చైనా చర్యలు.. దక్షిణ చైనా సముద్రంపై ఆ దేశ విధానాలను గుర్తుకుతెస్తున్నాయి. మన వైఫల్యాల వల్ల దక్షిణ చైనా సముద్రంలో చైనా సైన్యం మోహరించింది. ఇప్పుడు హిమాలయ సరిహద్దుల్లో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దీనికి అంతర్జాతీయ స్పందనేంటి? అమెరికా ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోంది’అని వాగ్నర్ పశ్నించారు. అది భారత్ సొంత విషయం ఈ చర్చ సందర్భంగా వెల్స్ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపద వల్లే చైనా ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. ‘ఉత్తర సరిహద్దులను సంరక్షించుకునేందుకు భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా డోక్లాం వివాదం భారత్‌కు చెందిన విషయం’ అని అన్నారు. గతేడాది జరిగిన డోక్లాం వివాదం దాదాపు 73 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో చైనా రోడ్డు నిర్మాణాలను చేపట్టడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత దౌత్యపరమైన చర్చలతో వివాదం సద్దుమణిగింది. కొత్త నిర్మాణాల్లేవ్: భారత్ డోక్లాం ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలేవీ చోటుచేసుకోలేదని, అక్కడ యథాతథ స్థితి నెలకొని ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. డోక్లాం దక్షిణ ప్రాంతంలో చైనా కొత్తగా రోడ్ల నిర్మాణం చేపడుతోందా అని రాజ్యసభలో వేసిన లిఖిత పూర్వక ప్రశ్నకు సింగ్ ఈ మేరకు బదులిచ్చారు. కిందటేడాది ఆగస్టు 28న డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా రక్షణ దళాలు మోహరించినప్పటి నుంచీ ఎవరూ అక్కడ కొత్తగా ఏ నిర్మాణం చేపట్టలేదన్నారు. -
డొక్లాంలో చైనా.. అడ్డగించని భారత్ : అమెరికా
న్యూఢిల్లీ : డొక్లాం సరిహద్దు ప్రాంతంలో చైనా చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని భారత్, భూటాన్లలో ఎవరూ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది. గురువారం ఈ మేరకు అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో మాట్లాడిన దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎలైస్ జీ వెల్స్ భారత్ సరిహద్దులో రోడ్లను నిర్మించడాన్ని చైనా వేగవంతం చేసిందని పేర్కొన్నారు. దాంతో కాంగ్రెస్ సభ్యురాలు వాగ్నర్ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహంలో భాగంగానే చైనా ఈ చర్యకు పాల్పడుతుందని అన్నారు. అమెరికా ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోందని ఆమె వెల్స్‌ను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన వెల్స్ అమెరికా ‘దక్షిణ చైనా సముద్రం వ్యూహం’కింద దీన్ని చూస్తోందని చెప్పారు. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపద వల్లే చైనా ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. గతేడాది జరిగిన డొక్లాం వివాదం దాదాపు 73 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో చైనా నిర్మాణాలను చేపట్టడంపై మన దేశం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో 73రోజుల పాటు సాగిన ప్రతిష్టంభనలో చైనా వెనకడుగు వేయక తప్పలేదు. తాజాగా చైనా, భారత్ ఆర్మీ క్యాంపులకు 80 మీటర్ల దూరంలోనే నిర్మాణాలు చేపడుతోందని, అయినా భారత్ ఎలాంటి చర్యలకు దిగడం లేని అమెరికా ప్రతినిధి చెప్పడం సంచలనంగా మారింది. 127 ఏళ్ల వివాదం డోక్లామ్‌తో చైనా–భూటాన్–భారత్ మధ్య ఏర్పడిన ఈ వివాదానికి నూటా పాతికేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1890లో టిబెట్–సిక్కింలకు సంబంధించిన విషయాలపై ఆనాడు భారత్‌ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం–క్వింగ్ (చైనా సార్వభౌముల) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఛుంబి లోయ వెంట అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించారు. ఆ తర్వాత కూడా టిబెట్–భూటాన్ మధ్య సరిహద్దు వివాదాస్పదంగానే ఉండేది. దానికి చైనా–భూటాన్–భారత్ కలిసే సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ (ట్రై జంక్షన్) కేంద్రంగా మారింది. చైనాతో భూటాన్‌కు ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో ఈ వివాదంలో భారత్ సహకారాన్ని ఆ దేశం కోరుతోంది. భారత్–భూటాన్ మధ్య అనేక ఒప్పందాలున్నాయి. చైనా అధీనంలోని డోక్లామ్ పీఠభూమిలో భారీ సైనిక వాహనాల కోసం రోడ్డు వేసేందుకు చైనా బలగాల సహాయంతో యంత్రాలను తరలించారు. తమ భూభాగంలోకి చొచ్చుకు రావడంపై భూటాన్ ఆర్మీ అభ్యంతరం తెలపడంతో పాటు వారిని వెనక్కు పంపేందుకు భారత్ సైన్యం సాయం కోరింది. -
డోక్లాం పర్యటనకు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలోని పలు సరిహద్దు ప్రాంతాల పర్యటనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటి సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వచ్చే నెలలో పర్యటించనుంది. 31 మంది సభ్యుల గల కమిటి ఈ పర్యటనకు వెళ్లనుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా,పలువురు సీనియర్ నేతలు దీనిలో పాల్గొననున్నారు. వివాదస్పద డోక్లాం ప్రాంతంలో కూడా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. డోక్లాం వివాదంతో భారత్-చైనా మధ్య గత కొంతకాలం యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. డోక్లాం ప్రాంతంలో భారత్- చైనా సైనిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వివాదానికి కారణం ఏంటి అనే అంశాలను ఈ కమిటి పరిశీలించనుందని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఏరియల్ వ్యూ కోసం ప్రత్యేక చాపర్‌ను ఉపయోగించనున్నారు. డోక్లాం ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డుకు భారత్ అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా-భూటాన్ మధ్యకూడా సరిహద్దు వివాదం ఉంది. డోక్లాం విషయంలో భూటాన్ మొదటి నుంచి భారత్‌కు అనుకూలంగానే ఉంది. గతంలో డోక్లాం వివాదంపై భారత విదేశాంగ అధికారులను రాహుల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా సృష్టిస్తున్న వివాదంపై చైనా అధికారులతో రాహుల్ గతంలో చర్చించారు. -
చైనాకు గట్టి సందేశం ఇవ్వాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలను సంధించింది. డోక్లాం సమస్యపై చైనాతో చర్చలు జరిపి ఆ దేశానికి బలమైన సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం ఇన్చార్జ్ రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. చైనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జింపింగ్‌తో మోదీ సమావేశం కానున్నరు. ఈ సమావేశంలో మోదీ డోక్లాం సమస్య గురించి జింపింగ్‌తో చర్చలు జరపాలని ట్విటర్ వేదికగా కోరారు. దక్షిణ డోక్లాం గుండా చైనా నిర్మిస్తున్న రోడ్‌పై మోదీ ఎందుకు మోనంగా ఉన్నారని రణ్‌దీప్ ప్రశ్నించారు. ఇటీవల ఇద్దరు కేంద్రమంత్రులు చైనా పర్యటనకు వెళ్లి డోక్లాం సమస్య గురించి ప్రస్తావించకపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన తప్పుపట్టారు. మంత్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని, విధినిర్వహణలో మంత్రులు విఫలమయ్యారని మోదీ అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. డోక్లాం సరిహదుల్లో భారత మిలటరీ క్యాంపుకు చైనా దళాలు 10 మీటర్లు ముందుకు దూసుకువచ్చాయని ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా చేరుకున్న ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జింపింగ్‌తో పలు అంశాలపై చర్చించనున్నారు. చివరి రోజు సమావేశంలో రెండు దేశాల ప్రతినిధులతో మోదీ, జింపింగ్ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
డోక్లాం మళ్లీ హాట్ జోన్ కానుందా..?
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి రాకతో మరోసారి ఇండో-చైనా సరిహద్దు వెంబడి వివాదాస్పద డోక్లాం ఉద్రిక్తతలకు కేంద్రం కానుందనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన దళాల కదలిలకలు మళ్లీ అలజడులు రేపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి సునిశితంగా ఉంటుందని, పెట్రోలింగ్, దళాల కదలికలు పెచ్చుమీరతాయని రక్షణ శాఖ సహాయమంత్రి సుభాష్ భమ్రే హెచ్చరించారు. ఈ వేసవిలో భారత్, చైనాల మధ్య డోక్లాంపై సందిగ్ధత నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా, చైనా, భూటాన్ ఉమ్మడి సరిహద్దు ప్రాంతంలో డోక్లాం వద్ద గత ఏడాది భారత్, చైనాల మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా పీపుల్స లిబరేషన్ ఆర్మీ చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని భారత సేనలు అడ్డగించడం వివాదానికి కేంద్ర బిందువైంది. సరిహద్దుల్లో చైనా సేనలు మోహరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కాగా, దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారా వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. -
‘డ్రాగన్‌కు మన సత్తా తెలిసొచ్చింది’
సాక్షి,లక్నో: దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, భారత్ సత్తా ఏంటో చైనాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఇనుమడించిందని చెప్పారు. చైనాతో డోక్లాం వివాదం సమసిపోయిందని, మోదీ సారథ్యంలో భారత్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ పాకిస్తాన్ చోద్యం చూస్తోందని రాజ్‌నాథ్ మండిపడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాక్ ఆగడాలకు మన దళాలు చెక్ పెడుతున్నాయని, భద్రతా దళాలు రోజూ ఐదు నుంచి పదిమంది ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయన్నారు. కుల సంఘాలతో సమావేశాలను తాము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చేపట్టడం లేదని, సమాజాన్ని దేశాన్ని నిర్మించేందుకే తాము రాజకీయాలను వాడుకుంటామని చెప్పారు. జన్‌థన్ యోజన, ఉజ్వల్ యోజన వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు చేరువైందని లక్నో నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్‌నాథ్ పేర్కొన్నారు. 2022 నాటికి పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రధాని అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పారు.పేదలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారని అన్నారు. -
డోక్లాం.. మళ్లీ చైనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా- భూటాన్ సరిహద్దు సమీప వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో డ్రాగన్ చర్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. భారత్‌తో తగువులాడి, ఆపై బలగాలను ఉపసంహరించుకున్న చైనా.. ఇప్పుడు భూటాన్ భూభాగంలో భారీ రోడ్డును నిర్మిస్తోంది. ఇందుకోసం సైనిక బలగాలతోపాటు భారీ యంత్రాలను అక్కడ మోహరింపజేసింది. కాగా, చైనా తీరుపై భూటాన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్- చైనాల మధ్య ఆగస్టు 28న జరిగిన చర్చల్లో.. డోక్లాం నుంచి సైన్యాలను ఉపసంహరించాలనే ఒప్పందం కుదిరింది. దీంతో వివాదాస్పద ప్రాంతం నుంచి ఇరుదేశాల సైన్యాలూ వెనక్కి జరిగాయి. భారత విదేశాంగ శాఖ సెప్టెంబర్ మొదటివారంలో చేసిన ప్రకటనలోనూ డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలు లేవని పేర్కొంది. అయితే, భారత్-చైనా సైన్యాలు పరస్పరం తలపడిన ప్రాంతం నుంచి ఉత్తరదిశలో చైనా కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మొత్తం 12 కిలోమీటర్ల రోడ్డు పనులను సెప్టెంబర్ 27న ప్రారంభించింది. అదేరోజు సాయంత్రం ఢిల్లీలోని భూటాన్ రాయబారి వెట్సొప్ నమ్గెల్.. చైనా రాయబారి లూ జవోహుయ్ను కలిసి చర్చలు జరిపారు. సమస్య ఇంకా పరిష్కారం కానందున, మరో దఫా చర్చలు జరుపుతామని భూటాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తోన్న భారత్ ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన చేయలేదు. -
'భారత్‌తో మాకు ఇక పంచాయితీల్లేవ్'
బీజింగ్ : భారత్‌తో కలిసి మరింత ముందుకు వెళతామని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటామని చైనా స్పష్టం చేసింది. డోక్లామ్ వివాదాన్ని పక్కన పెట్టేశామని, ఆ విషయం పట్టించుకోకుండా ఆ వివాదం జోలికి వెళ్లకుండా అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చైనా అధికారి మా జాన్‌వూ తెలిపారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 68వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 'ఇండియా-చైనా కలిసి పనిచేస్తున్నాయి. ఈ నెల(సెప్టెంబర్) 5న ఇరు దేశాల సంబంధాలను ఎలా వృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలో మా అధ్యక్షుడు జీజిన్పింగ్, భారత్ ప్రధాని నరేంద్రమోదీ కలిసి చర్చించుకున్నారు. సుదీర్ఘకాలంగా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నట్లుగానే ఇక ముందు కూడా అభివృద్ధిని, సహకారాన్ని పెంచుకోగలం. ఇక డోక్లామ్ ఎపిసోడ్‌కు తెరపడినట్లేనా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. 'అవును.. ఆ విషయాన్ని పక్కన పడేసి కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలని అనుకుంటున్నాము' అని ఆయన స్పష్టం చేశారు. -
డోక్లామ్‌పై చైనా ఎందుకు తగ్గింది?
రెండు ఆసియా దిగ్గజాలు భారత్, చైనా మధ్య ఉద్రిక్తతకు, యుద్ధవాతావరణానికి తెరలేపిన డోక్లామ్‌నుంచి సేనల ఉపసంహరణతో వివాదం సద్దుమణిగింది. ఈ గొడవలో చిన్న పాత్రధారి అయిన బుల్లి హిమాలయరాజ్యం భూటాన్ప్రస్తావన లేకుండానే రెండు పెద్ద దేశాలూ డోక్లామ్వివాదానికి స్వస్తి పలికి జూన్19 నాటి పరిస్థితి పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించాయి. భూటాన్కూడా మంగళవారం దీనిపై హర్షం ప్రకటించింది. చైనా సైనిక నిర్మాణానికి ప్రతిగా భూటాన్అధీనంలోని ఈ పీఠభూమిలోకి భారత సైనికుల బృందం రెండు బుల్డోజర్లతో రాగానే చైనా మీడియా, ప్రభుత్వ విభాగాలు స్వరం పెంచి అవసరానికి మించి స్పందించాయి. డోక్లామ్‌పై ఘర్షణ తప్పకపోతే 1962 యుద్ధంలో జరిగినదానికంటే ఇండియా ఈసారి ఎక్కువ నష్టపోతుందని చైనా పత్రికలు హెచ్చరించాయి. పాశ్చాత్య మీడియా మరి కొంత ముందుకెళ్లి ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చని కూడా జోస్యం చెప్పాయి. సరిహద్దుల్లో ఇంత వేడి పుట్టించాక 75 రోజుల లోపే చైనా దిగివచ్చి ఇండియాకు శాంతిహస్తం అందించి దళాల వాససు ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఉద్రిక్తతకు తెరపడినా, డోక్లామ్ప్రాంతంలో చైనా సరిహద్దుదళాలు తన గస్తీ, స్థావరం పరిరక్షణ బాధ్యతలు కొనసాగిస్తాయని చైనా విదేశాంగ ప్రతినిధి ప్రకటించడంపై విపరీతార్ధాలు తీసి, అనవసర భయాలు పెట్టుకోవడం సబబుకాదని కొందరు చైనా నిపుణులు సలహా ఇస్తున్నారు. వాతావరణం, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డు నిర్మాణం పూర్తిచేసే విషయంపై తగిన సమయంలో నిర్ణయిస్తామని చైనా అధికారి ఒకరు వివరించారు. డోక్లామ్రగడలో హఠాత్తుగా, పూర్తిగా తన వైఖరి మార్చుకున్నట్టు కనపడకుండా ఉండటానికే చైనా ప్రతినిధులు ఇలా మాట్లాడుతున్నారు. చైనా వైఖరిలో మార్పునకు కారణాలేంటి? డోక్లామ్‌లో భారత్, భూటాన్‌పై చైనా కయ్యానికి కాలుదువ్వే సమయంలోనే దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా, దాని మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాలతో మాటల యుద్ధానికి దిగింది. ప్రపంచదేశాల అభిప్రాయాలు పట్టించుకోని ‘ధూర్తరాజ్యం’గా ముద్రపడిన ఉత్తరకొరియా చర్యలకు చైనా మద్దతే కారణమనే ప్రచారం జరిగింది. డోక్లామ్విషయంలో చైనా దూకుడును పలుకుబడికలిగిన పాశ్యాత్యదేశాలకు ఇండియా చక్కగా వివరించగలిగింది. సెప్టెంబర్35 మధ్య చైనాలోని షియామెన్‌లో జరిగే ఐదు దేశాల బ్రిక్స్శిఖరాగ్ర సదస్సును డోక్లామ్వివాదం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ బహిష్కరిస్తే సభ చిన్నబోవడంతోపాటు చైనా పరువు పలచనయ్యే ప్రమాదం చైనా కళ్లెదుట కనిపించింది. ఐదేళ్ల క్రితం చైనా కమ్యూనిస్ట్‌పార్టీ నాయకత్వం తర్వాత దేశాధ్యక్షపదవి చేపట్టిన జీజిన్పింగ్దేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికారు. మావో జెడాంగ్, డెంగ్మాదిరిగా చైనాను సంక్షోభం నుంచి కాపాడే బృహత్తర బాధ్యత నెత్తినేసుకున్న జిన్‌పింగ్‌కు అంతర్గత సమస్యలు అనేకం ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్నేతృత్వంలోని అమెరికా నుంచి ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచ ఆర్థికమాంద్యం వల్ల చైనా వృద్ధిరేటు మందగించింది. డోక్లామ్దెబ్బతో భారత్‌లో చైనా ఉత్పత్తుల కొనుగోళ్లు బాగా తగ్గిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. డోక్లామ్‌నుంచి చైనా వైదొలగడానికి ఈ అంశాలన్నీ కారణాలని భావిస్తున్నారు. చైనా పరువు ఇండియాయే కాపాడిందా? ఈ వివాదంలో చివరికి చైనా తన పరువు కాపాడుకోవడానికి వీలుగా తానే మొదట డోక్లామ్‌నుంచి దళాలను ఉపసంహరించుకోవడానికి ఇండియా అంగీకరించిందనీ, రోడ్డు నిర్మాణం ఆపేస్తానన్న (ఇంకా బహిరంగంగా ప్రకటించని) హామీ మేరకే భారత్అందుకు ఒప్పుకుందని ఈ వివాదాన్ని మొదట్నించీ గమనిస్తున్న ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు. భూటాన్అభ్యర్థన మేరకు డోక్లామ్ప్రాంతానికి వెళ్లిన మూడొందల మంది భారత సైనికులు మకాం వేసిన ప్రాంతానికి అవతల చైనా సైనిక రహదారి నిర్మిస్తున్న భూభాగం చాలా దిగువున ఉండడం కూడా తనకు ప్రయోజనకారి కాదనే చైనాకు అర్ధమైందని చెబుతున్నారు. చైనాకు ఇప్పుడు అన్నిటికన్నా బ్రిక్స్సదస్సును విజయవంతంగా ముగించడమే ముఖ్యమైనందున ఈ వివాదంలో హిమాలయాల ఎత్తునుంచి నేల మీదుకు మూడు నెలల లోపే దిగివచ్చేసింది. డోక్లామ్విషయంలో చైనా సర్కారు, మీడియా పూనకమొచ్చినట్టు చేసిన ప్రచారానికి, బెదిరింపులకు లొంగకుండా భారత్నింపాదిగా నిలబడి చివరికి విజయం సాధించిందని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వాస్తవిక అంచనాలు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్కుమార్డోభాల్తెరచాటు దౌత్యం వల్లే డోక్లామ్‌పై ఇండియా దృఢవైఖరి అవలంబించి చైనాను దారికి తెచ్చిందని కొందరు నిపుణుల అంచనా. – సాక్షి నాలెడ్జ్సెంటర్ -
'మూడు వ్యూహాలతో భారత్‌పైకి చైనా'
న్యూఢిల్లీ : ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా భారత్‌పై చైనా గెలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో పిలిప్పీన్స్‌పై ఉపయోగించిన మూడు వ్యూహాలనే తిరిగి భారత్‌పై ప్రయోగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. భారత్ చైనాల మధ్య గత 50 రోజులకు పైగా డోక్లామ్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ పరిశీలిస్తున్న భారత వ్యూహకర్తలు చైనా లక్ష్యాన్ని పసిగట్టారు. చివరకు చైనా తన మూడు వ్యూహాలను భారత్‌పై ప్రయోగించడం మొదలుపెట్టిందని, అందులో భాగంగానే ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఏమిటి ఆ మూడు వ్యూహాలు? మీడియా యుద్ధం ప్రజలు అభిప్రాయపడుతున్నట్లుగా తొలుత మీడియాతో దాడి చేయించడం. ఇందులో భాగంగా అక్కడి కొందరు నేతలతో దురుసుగా మాట్లాడించడం, ప్రజలు కూడా దానికి మద్దతిస్తున్నట్లుగా కథనాల్లో పేర్కొనడం. ఇలా చేయడం ద్వారా ప్రత్యర్థిని ఒక ఆలోచనలో పడేస్తారు. మానసిక యుద్ధం చైనా మీడియా ప్రచురించిన వార్తలను ఉన్నది ఉన్నట్లుగా తిరిగి ప్రత్యర్థి దేశంలోని మీడియా వారి దేశంలో వెల్లడిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఘర్షణ ఎందుకులే అనే భావనలోకి ప్రత్యర్థి దేశం రావడం, స్వశక్తిపై నమ్మకం కోల్పోయి రాజీపడటంలాంటివి జరుగుతుంది. ఈ క్రమంలో తొలుత రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనూహ్యంగా ప్రత్యర్థి నుంచి కూడా వస్తాయి. వీటిని మరింత క్యాచ్ చేసుకొని అంతర్జాతీయ సమాజానికి చూపించాలని చైనా భావిస్తుంటుంది. చట్టపరమైన యుద్ధం అంతర్జాతీయ న్యాయస్థానం వద్ద ప్రభావవంతంగా పనిచేయడమే ఈ వ్యూహ ప్రధాన ఉద్దేశం. అంతకుముందు తాను రెచ్చగొట్టడం ద్వారా ప్రత్యర్థి చేసిన పొరపాట్లన్ని కూర్చి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు పెడుతుంది. అప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానం తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే దాన్ని కూడా దిక్కరిస్తుంది. ఎప్పుడు న్యాయ నిబంధనలు గౌరవిస్తుందో.. అవమానపరుస్తుందో ఆ దేశానికి తెలియని తీరుగా వ్యవరిస్తుంటుంది. ప్రస్తుతం పై మూడు వ్యూహాలనే భారత్‌పై ప్రయోగిస్తున్నట్లు భారత వ్యూహాల నిపుణులు అంటున్నారు.