డోక్లాం వద్ద చైనా సైన్యం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా- భూటాన్ సరిహద్దు సమీప వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో డ్రాగన్ చర్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. భారత్‌తో తగువులాడి, ఆపై బలగాలను ఉపసంహరించుకున్న చైనా.. ఇప్పుడు భూటాన్ భూభాగంలో భారీ రోడ్డును నిర్మిస్తోంది. ఇందుకోసం సైనిక బలగాలతోపాటు భారీ యంత్రాలను అక్కడ మోహరింపజేసింది. కాగా, చైనా తీరుపై భూటాన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
భారత్- చైనాల మధ్య ఆగస్టు 28న జరిగిన చర్చల్లో.. డోక్లాం నుంచి సైన్యాలను ఉపసంహరించాలనే ఒప్పందం కుదిరింది. దీంతో వివాదాస్పద ప్రాంతం నుంచి ఇరుదేశాల సైన్యాలూ వెనక్కి జరిగాయి. భారత విదేశాంగ శాఖ సెప్టెంబర్ మొదటివారంలో చేసిన ప్రకటనలోనూ డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలు లేవని పేర్కొంది.
అయితే, భారత్-చైనా సైన్యాలు పరస్పరం తలపడిన ప్రాంతం నుంచి ఉత్తరదిశలో చైనా కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మొత్తం 12 కిలోమీటర్ల రోడ్డు పనులను సెప్టెంబర్ 27న ప్రారంభించింది. అదేరోజు సాయంత్రం ఢిల్లీలోని భూటాన్ రాయబారి వెట్సొప్ నమ్‌గెల్.. చైనా రాయబారి లూ జవోహుయ్‌ను కలిసి చర్చలు జరిపారు. సమస్య ఇంకా పరిష్కారం కానందున, మరో దఫా చర్చలు జరుపుతామని భూటాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తోన్న భారత్ ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment