సాక్షి,లక్నో: దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, భారత్ సత్తా ఏంటో చైనాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఇనుమడించిందని చెప్పారు. చైనాతో డోక్లాం వివాదం సమసిపోయిందని, మోదీ సారథ్యంలో భారత్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ పాకిస్తాన్ చోద్యం చూస్తోందని రాజ్‌నాథ్ మండిపడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పాక్ ఆగడాలకు మన దళాలు చెక్ పెడుతున్నాయని, భద్రతా దళాలు రోజూ ఐదు నుంచి పదిమంది ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయన్నారు. కుల సంఘాలతో సమావేశాలను తాము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చేపట్టడం లేదని, సమాజాన్ని దేశాన్ని నిర్మించేందుకే తాము రాజకీయాలను వాడుకుంటామని చెప్పారు. జన్‌థన్ యోజన, ఉజ్వల్ యోజన వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు చేరువైందని లక్నో నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్‌నాథ్ పేర్కొన్నారు. 2022 నాటికి పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రధాని అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పారు.పేదలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment