న్యూఢిల్లీ : డొక్లాం సరిహద్దు ప్రాంతంలో చైనా చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని భారత్, భూటాన్‌లలో ఎవరూ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది. గురువారం ఈ మేరకు అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో మాట్లాడిన దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎలైస్ జీ వెల్స్ భారత్ సరిహద్దులో రోడ్లను నిర్మించడాన్ని చైనా వేగవంతం చేసిందని పేర్కొన్నారు. దాంతో కాంగ్రెస్ సభ్యురాలు వాగ్నర్ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహంలో భాగంగానే చైనా ఈ చర్యకు పాల్పడుతుందని అన్నారు. అమెరికా ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోందని ఆమె వెల్స్‌ను ప్రశ్నించారు.
ఇందుకు స్పందించిన వెల్స్ అమెరికా ‘దక్షిణ చైనా సముద్రం వ్యూహం’కింద దీన్ని చూస్తోందని చెప్పారు. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపద వల్లే చైనా ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. గతేడాది జరిగిన డొక్లాం వివాదం దాదాపు 73 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్‌లో చైనా నిర్మాణాలను చేపట్టడంపై మన దేశం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో 73రోజుల పాటు సాగిన ప్రతిష్టంభనలో చైనా వెనకడుగు వేయక తప్పలేదు. తాజాగా చైనా, భారత్ ఆర్మీ క్యాంపులకు 80 మీటర్ల దూరంలోనే నిర్మాణాలు చేపడుతోందని, అయినా భారత్ ఎలాంటి చర్యలకు దిగడం లేని అమెరికా ప్రతినిధి చెప్పడం సంచలనంగా మారింది.
127 ఏళ్ల వివాదం
డోక్లామ్‌తో చైనా–భూటాన్–భారత్ మధ్య ఏర్పడిన ఈ వివాదానికి నూటా పాతికేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1890లో టిబెట్–సిక్కింలకు సంబంధించిన విషయాలపై ఆనాడు భారత్‌ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం–క్వింగ్ (చైనా సార్వభౌముల) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఛుంబి లోయ వెంట అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించారు. ఆ తర్వాత కూడా టిబెట్–భూటాన్ మధ్య సరిహద్దు వివాదాస్పదంగానే ఉండేది. దానికి చైనా–భూటాన్–భారత్ కలిసే సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ (ట్రై జంక్షన్) కేంద్రంగా మారింది.
చైనాతో భూటాన్‌కు ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో ఈ వివాదంలో భారత్ సహకారాన్ని ఆ దేశం కోరుతోంది. భారత్–భూటాన్ మధ్య అనేక ఒప్పందాలున్నాయి. చైనా అధీనంలోని డోక్లామ్ పీఠభూమిలో భారీ సైనిక వాహనాల కోసం రోడ్డు వేసేందుకు చైనా బలగాల సహాయంతో యంత్రాలను తరలించారు. తమ భూభాగంలోకి చొచ్చుకు రావడంపై భూటాన్ ఆర్మీ అభ్యంతరం తెలపడంతో పాటు వారిని వెనక్కు పంపేందుకు భారత్ సైన్యం సాయం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment