డోక్లామ్‌పై చైనా ఎందుకు తగ్గింది?
రెండు ఆసియా దిగ్గజాలు భారత్, చైనా మధ్య ఉద్రిక్తతకు, యుద్ధవాతావరణానికి తెరలేపిన డోక్లామ్‌నుంచి సేనల ఉపసంహరణతో వివాదం సద్దుమణిగింది. ఈ గొడవలో చిన్న పాత్రధారి అయిన బుల్లి హిమాలయరాజ్యం భూటాన్‌ప్రస్తావన లేకుండానే రెండు పెద్ద దేశాలూ డోక్లామ్‌వివాదానికి స్వస్తి పలికి జూన్19 నాటి పరిస్థితి పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించాయి. భూటాన్‌కూడా మంగళవారం దీనిపై హర్షం ప్రకటించింది.
చైనా సైనిక నిర్మాణానికి ప్రతిగా భూటాన్‌అధీనంలోని ఈ పీఠభూమిలోకి భారత సైనికుల బృందం రెండు బుల్‌డోజర్లతో రాగానే చైనా మీడియా, ప్రభుత్వ విభాగాలు స్వరం పెంచి అవసరానికి మించి స్పందించాయి. డోక్లామ్‌పై ఘర్షణ తప్పకపోతే 1962 యుద్ధంలో జరిగినదానికంటే ఇండియా ఈసారి ఎక్కువ నష్టపోతుందని చైనా పత్రికలు హెచ్చరించాయి. పాశ్చాత్య మీడియా మరి కొంత ముందుకెళ్లి ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చని కూడా జోస్యం చెప్పాయి. సరిహద్దుల్లో ఇంత వేడి పుట్టించాక 75 రోజుల లోపే చైనా దిగివచ్చి ఇండియాకు శాంతిహస్తం అందించి దళాల వాససు ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించింది.
ఉద్రిక్తతకు తెరపడినా, డోక్లామ్‌ప్రాంతంలో చైనా సరిహద్దుదళాలు తన గస్తీ, స్థావరం పరిరక్షణ బాధ్యతలు కొనసాగిస్తాయని చైనా విదేశాంగ ప్రతినిధి ప్రకటించడంపై విపరీతార్ధాలు తీసి, అనవసర భయాలు పెట్టుకోవడం సబబుకాదని కొందరు చైనా నిపుణులు సలహా ఇస్తున్నారు. వాతావరణం, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డు నిర్మాణం పూర్తిచేసే విషయంపై తగిన సమయంలో నిర్ణయిస్తామని చైనా అధికారి ఒకరు వివరించారు. డోక్లామ్‌రగడలో హఠాత్తుగా, పూర్తిగా తన వైఖరి మార్చుకున్నట్టు కనపడకుండా ఉండటానికే చైనా ప్రతినిధులు ఇలా మాట్లాడుతున్నారు.
చైనా వైఖరిలో మార్పునకు కారణాలేంటి?
డోక్లామ్‌లో భారత్, భూటాన్‌పై చైనా కయ్యానికి కాలుదువ్వే సమయంలోనే దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా, దాని మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాలతో మాటల యుద్ధానికి దిగింది. ప్రపంచదేశాల అభిప్రాయాలు పట్టించుకోని ‘ధూర్తరాజ్యం’గా ముద్రపడిన ఉత్తరకొరియా చర్యలకు చైనా మద్దతే కారణమనే ప్రచారం జరిగింది. డోక్లామ్‌విషయంలో చైనా దూకుడును పలుకుబడికలిగిన పాశ్యాత్యదేశాలకు ఇండియా చక్కగా వివరించగలిగింది. సెప్టెంబర్35 మధ్య చైనాలోని షియామెన్‌లో జరిగే ఐదు దేశాల బ్రిక్స్‌శిఖరాగ్ర సదస్సును డోక్లామ్‌వివాదం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ బహిష్కరిస్తే సభ చిన్నబోవడంతోపాటు చైనా పరువు పలచనయ్యే ప్రమాదం చైనా కళ్లెదుట కనిపించింది.
ఐదేళ్ల క్రితం చైనా కమ్యూనిస్ట్‌పార్టీ నాయకత్వం తర్వాత దేశాధ్యక్షపదవి చేపట్టిన జీజిన్‌పింగ్‌దేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికారు. మావో జెడాంగ్, డెంగ్‌మాదిరిగా చైనాను సంక్షోభం నుంచి కాపాడే బృహత్తర బాధ్యత నెత్తినేసుకున్న జిన్‌పింగ్‌కు అంతర్గత సమస్యలు అనేకం ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌నేతృత్వంలోని అమెరికా నుంచి ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచ ఆర్థికమాంద్యం వల్ల చైనా వృద్ధిరేటు మందగించింది. డోక్లామ్‌దెబ్బతో భారత్‌లో చైనా ఉత్పత్తుల కొనుగోళ్లు బాగా తగ్గిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. డోక్లామ్‌నుంచి చైనా వైదొలగడానికి ఈ అంశాలన్నీ కారణాలని భావిస్తున్నారు.
చైనా పరువు ఇండియాయే కాపాడిందా?
ఈ వివాదంలో చివరికి చైనా తన పరువు కాపాడుకోవడానికి వీలుగా తానే మొదట డోక్లామ్‌నుంచి దళాలను ఉపసంహరించుకోవడానికి ఇండియా అంగీకరించిందనీ, రోడ్డు నిర్మాణం ఆపేస్తానన్న (ఇంకా బహిరంగంగా ప్రకటించని) హామీ మేరకే భారత్‌అందుకు ఒప్పుకుందని ఈ వివాదాన్ని మొదట్నించీ గమనిస్తున్న ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు. భూటాన్‌అభ్యర్థన మేరకు డోక్లామ్‌ప్రాంతానికి వెళ్లిన మూడొందల మంది భారత సైనికులు మకాం వేసిన ప్రాంతానికి అవతల చైనా సైనిక రహదారి నిర్మిస్తున్న భూభాగం చాలా దిగువున ఉండడం కూడా తనకు ప్రయోజనకారి కాదనే చైనాకు అర్ధమైందని చెబుతున్నారు.
చైనాకు ఇప్పుడు అన్నిటికన్నా బ్రిక్స్‌సదస్సును విజయవంతంగా ముగించడమే ముఖ్యమైనందున ఈ వివాదంలో హిమాలయాల ఎత్తునుంచి నేల మీదుకు మూడు నెలల లోపే దిగివచ్చేసింది. డోక్లామ్‌విషయంలో చైనా సర్కారు, మీడియా పూనకమొచ్చినట్టు చేసిన ప్రచారానికి, బెదిరింపులకు లొంగకుండా భారత్‌నింపాదిగా నిలబడి చివరికి విజయం సాధించిందని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వాస్తవిక అంచనాలు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌కుమార్‌డోభాల్‌తెరచాటు దౌత్యం వల్లే డోక్లామ్‌పై ఇండియా దృఢవైఖరి అవలంబించి చైనాను దారికి తెచ్చిందని కొందరు నిపుణుల అంచనా.
– సాక్షి నాలెడ్జ్‌సెంటర్