
యూపీ ఎన్నికల్లో బంధువులకే పెద్ద పీట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న పాలకపక్ష సమాజ్‌వాది పార్టీ, భారతీయ జనతా పార్టీల అభ్యర్థుల ఎంపికలో బంధుప్రీతి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 403 సీట్లకుగాను భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 371 మంది పేర్లను ప్రకటించగా, వారిలో 39 మంది నేతల సమీప బంధువులే ఉన్నారు. అంటే ప్రకటించిన అభ్యర్థుల్లో పది శాతానికి పైగా టిక్కెట్లు బంధువులకే వెళ్లాయన్నమాట. అభ్యర్థుల పేర్లను పరిశీలించినట్లయితే ఎవరి పలుకుబడి కారణంగా వారికి టిక్కెట్లు లభించాయో సులభంగానే గ్రహించవచ్చు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ బంధువు అనితా లోధి రాజ్‌పుత్, సందీప్ సింగ్‌లు అభ్యర్థుల్లో ఉన్నారు. కొడుకులకు, కూతుళ్లకు టిక్కెట్లు అడగవద్దని ఇటీవల ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పది శాతానికిపైగా బంధువులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నరేంద్ర మోదీని సంప్రదించకుండానే యూపీ అభ్యర్థులను ఎంపిక చేశారని అనుకోలేం. బంధువుల టిక్కెట్లకు ఆయన ఆమోదం తెలపడానికి నాయకుల ఒత్తిడికి తలొగ్గారా లేదా అట్లయితేనే యూపీ లాంటి రాష్ట్రంలో పార్టీ గెలుస్తుందని మోదీ భావించరా? అన్నది ఇక్కడ ముఖ్యం. పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావాన్ని చూపిన నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు ఒత్తిడికి మోదీ తలొగ్గే అవకాశం కూడా ఉంది.
ఇక పాలకపక్ష సమాజ్‌వాది పార్టీ విషయానికొస్తే అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో వారికి ముందుగా బంధువులు ముఖ్యం. ముందు నుంచి తాను వ్యతిరేకిస్తున్న బాబాయ్ శివపాల్ యాదవ్‌కు అఖిలేష్ యాదవ్ టిక్కెట్ ఇవ్వడమే కాకుండా పార్టీ బలంగా ఉన్న ఇటావా జిల్లా జశ్వంత్ నగర్ నుంచి నిలబెట్టడం విశేషం. ములాయం రెండో భార్య కుమారుడైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్‌తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ మేనల్లుడు అంశూల్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్‌లు కాకుండా ఇప్పటికే ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే పార్టీ రాజకీయాల్లో ఉన్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకుడు ఆజమ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజమ్, నరేష్ అగర్వాల్ కుమారుడు నితిన్ అగర్వాల్‌లకు ఇచ్చారు. మొత్తం జాబితాలో పార్టీ సీనియర్ నాయకులకు చెందిన 22 మంది బంధువులకు టిక్కెట్లు ఇచ్చారు.
కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని పార్టీలు విమర్శిస్తున్న బహుజన సమాజ్ పార్టీ సుప్రీం మాయావతి బంధుప్రీతికి దూరంగా ఉన్నారు. అందకు కారణం ఆమె రాజకీయ గురువు కాన్షీరామ్ బోధనల ప్రభావం కావచ్చు. ఆయనెప్పుడు తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. పైగా తన రాజకీయాల కోసం కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకున్నారు. ఆమె పార్టీలో 15 మంది అభ్యర్థులు మాత్రమే పార్టీ సీనియర్ నాయకుల బంధువులు ఉన్నారు.