భోగీల డోర్ల వద్ద కట్టెల మోపులు
జయపురం: విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్ రైలు ప్రయాణికుల కోసమా లేక సరుకులు రవాణా కోసమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించటంలో, రక్షణ ఏర్పరచటంలో రైల్వే విభాగం విఫలమవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొరాపుట్ జిల్లాకు చెందిన ఒక ప్రయాణికుడు విశాఖపట్నం–కిరండూల్ రైలులో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో గురువారం వ్యక్తపరిచాడు.
ఆయన విశాఖపట్నం నుంచి విశాఖ–కిరండూల్ రైలులో వస్తుండగా రైలు భోగీలలో సీట్లపై ప్రయాణికులకు బదులు కాయకూరల మూటలు దర్శనమిచ్చాయి. వాటిని తీయమనగా వినేనాథుడులేడు. ఈ విషయం టీటీకి తెలుపగా ఆయన అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సీట్లపైనే కాదు సీట్ల కింద, నడిచే మార్గంలో కాయకూరల మూటలు వేసి ఉండటంతో ప్రయాణికులు కూర్చొనేందుకు ఇక్కట్లు పడ్డారు.
వాటిని తొలగించి ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు రైల్వే సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని కొంతమంది ఆరోపించారు. అసలు విశాఖపట్నం–కిరండూల్ పాసింజర్ రైలులో ప్రతి దినం ఇదే పరిస్థితి అని కొంతమంది వాపోయారు. అయినా రైల్వే అధికారులు గాని టీటీలు గాని పట్టించుకోరని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ రైలులో కేవలం కాయకూరల మూటలే కాదని అన్ని వస్తువులను భోగీలలో అడ్డంగా పడవేసి ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తున్నారని పులువురు వెల్లడించారు. కట్టెలను బోగీల తులుపుల వద్ద ఉంచటం పరిపాటి అని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనవుతున్నారని కొంతమంది తెలిçపారు.
రైల్వే అధికారులు ఈ విషయంలో దృష్టి సారించి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా భోగీలలో కాయకూరల బస్తాలు, కట్టెల మోపులకు అనుమతించకుండా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment