
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్యకేసులో నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయదోషుల్లో న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోని ఏకైక వ్యక్తి పవన్ గుప్తా, అలాగే నిర్భయ కేసులో రాష్ట్రపతి దయాభిక్ష కోసం అర్జీపెట్టుకున్న చివరి వ్యక్తి కూడా పవన్ గుప్తాయే. నిర్భయ ఘటనలో నలుగురు దోషులు ముకేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్‌లకు మార్చి3న ఉరిశిక్ష అమలుచేయాలని ఫిబ్రవరి 17న ట్రయల్ కోర్టు ఆదేశించింది. వీరిలో ఇప్పటికే ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌ల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. రాష్ట్రపతి దయాభిక్ష పిటిషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ ముకేశ్, వినయ్ లు దాఖలు చేసుకున్న ప్రత్యేక పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని ఇంకా అక్షయ్ కోర్టులో సవాలు చేయలేదు.