డాక్టర్ వద్ద రూ. 70 లక్షలు.. అన్నీ వందనోట్లే!
డాక్టర్ వద్ద రూ. 70 లక్షలు.. అన్నీ వందనోట్లే!
Published Thu, Nov 17 2016 2:27 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
దేశ రాజధాని ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని ఓ పిల్లల వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద రూ. 70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. అవన్నీ వందనోట్లే! దేశంలో ఒక పక్క వందనోట్లు దొరక్క సామాన్యులు నానా కష్టాలు పడుతుంటే ఒక్కరి దగ్గరే ఏకంగా 70 లక్షల రూపాయల మొత్తానికి వంద నోట్లు ఉన్నాయంటే అది చిన్న విషయం కాదని జనం కూడా మండిపడుతున్నారు. నల్లాల్ అనే ఈ వైద్యుడు మొత్తం నగదు అంతటినీ కట్టలుగా కట్టి తన కారులో పెడుతుండగా అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి.. పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర మొత్తం రూ. 69.86 లక్షల విలువైన వంద నోట్లు లభ్యమయ్యాయి. వ్యాపారవేత్త అయిన తన స్నేహితుడు ఆ డబ్బు తనకిచ్చాడని, తాను రాజౌరి గార్డెన్‌లోని అతడి ఇంటికి ఆ సొమ్ము తీసుకెళ్తున్నానని వైద్యుడు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. వారు దర్యాప్తు చేస్తున్నారు.
73 లక్షల పాతనోట్లు స్వాధీనం
మరోవైపు మహారాష్ట్రలో రెండు కార్ల నుంచి ఇప్పటికే రద్దుచేసిన 1000, 500 రూపాయల నోట్లతో కూడిన 73 లక్షల రూపాయలను పట్టుకున్నారు. నాసిక్-ఔరంగాబాద్ రోడ్డులో పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. అంతలో నాసిక్ నుంచి కోపర్‌గావ్ వైపు వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా.. రూ. 32,99,500 దొరికాయి.
గుజరాత్ నుంచి మహారాష్ట్రలోని వైజాపూర్ వైపు వెళ్తున్న మరో కారును కూడా ఆపి తనిఖీ చేయగా.. అందులో మరో రూ. 40 లక్షలు కూడా దొరికాయి. ఈ విషయమై పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందంచారు. ఒక బ్యాంకు మేనేజర్‌ను కౌంటింగ్ మిషన్‌తో సహా పిలిచి డబ్బు లెక్కపెట్టించారు.
Advertisement
Advertisement