delhi doctor
-
సరి‘హద్దు’లు చెరిపిన మానవత్వం.. పాక్ బాలికకు పునర్జన్మ!
న్యూఢిల్లీ: ‘మతములన్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్నారు మహాకవి గురజాడ. మత, ప్రాంత భేదాలన్నీ మాసిపోయి.. మానవత్వమొక్కటే నిలబడుతుందని రుజువు చేశారో ఢిల్లీ డాక్టర్. ఉచితంగా వైద్యమందించి మెడ వంకరతో ఏళ్లుగా బాధపడుతున్న పాక్ బాలికను మామూలు మనిషిని చేశారు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కు చెందిన అఫ్షీన్ గుల్ వయసిప్పుడు 12 ఏళ్లు. బాలిక పది నెలల చిన్నారిగా ఉన్నసమయంలో తన అక్క చేతుల్లోంచి జారిపడిపోయింది. అంతే మెడ 90 డిగ్రీలు వంగిపోయింది. అక్కడ డాక్టర్లకు చూపిస్తే మందులిచ్చారు. కానీ మెడ సెట్ కాలేదు. మెడ వంకరకు సెరిబ్రల్ పాల్సీ కూడా తోడవడంతో అఫ్షీన్ జీవితం నిత్య నరకమైంది. ఆడుకోలేదు. చదువుకోనూ లేదు. స్నేహితులు లేరు. అవన్నీ కాదు... అసలు తినడం, నడవడం, మాట్లాడటమే కష్టమైంది. బ్రిటిష్ జర్నలిస్టు అలెగ్జాండ్రియా థామస్ అఫ్షీన్ వ్యథను రిపోర్ట్ చేసింది. అది ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్కు తెలిసింది. జర్నలిస్టు ద్వారా కుటుంబంతో మాట్లాడిన డాక్టర్... అఫ్షీన్ను మామూలు మనిషిని చేస్తానని మాటిచ్చారు. అలా 2021 నవంబర్లో బాలికను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఉచిత వైద్యమందించారు. నాలుగు అతిపెద్ద సర్జరీలను పైసా తీసుకోకుండా చేశారు. ఇప్పుడా బాలిక నవ్వుతోంది, మాట్లాడగలుగుతోంది. మామూలు మనిషైపోయింది. డాక్టర్ సర్జరీలు చేసి చేతులు దులుపుకోలేదు. ఇప్పటికీ స్కైప్లో బాలిక పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇదీ చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్ను కదిలిస్తున్న వీడియో చూశారా? -
భూమ్మీద నూకలు మిగిలి ఉంటే..
-
భూమ్మీద నూకలు మిగిలి ఉంటే..
ఆమె ఓ వైద్యురాలు. వయసు దాదాపు 27 సంవత్సరాలు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ.. గుర్గావ్లోని మెట్రోస్టేషన్లో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అప్పటివరకు ప్లాట్ఫాం మీద అటూ ఇటూ నడుస్తూ ఉన్న ఆమె.. రైలు రాగానే ఒక్కసారిగా దాని ముందు పట్టాల మీదకు దూకారు. ఆమె చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది. అయితే భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉండటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం సమయంలో గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్లో ఈ ఘటన జరగడంతో దాదాపు పది నిమిషాల పాటు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. అది ఆత్మహత్యా ప్రయత్నం కాదని రైల్వే అధికారులు అంటున్నారు గానీ, సీసీ టీవీ ఫుటేజి చూస్తే మాత్రం ఆమె సరిగ్గా రైలు వచ్చే సమయానికే పట్టాల మీదకు దూకినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకు పలు ఫ్రాక్చర్లు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే.. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి మాత్రం ఇంకా ఆమె ఆరోగ్యం సహకరించడం లేదని, ఆమె కోలుకోగానే ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు అంటున్నారు. -
డాక్టర్ వద్ద రూ. 70 లక్షలు.. అన్నీ వందనోట్లే!
దేశ రాజధాని ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలోని ఓ పిల్లల వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద రూ. 70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. అవన్నీ వందనోట్లే! దేశంలో ఒక పక్క వందనోట్లు దొరక్క సామాన్యులు నానా కష్టాలు పడుతుంటే ఒక్కరి దగ్గరే ఏకంగా 70 లక్షల రూపాయల మొత్తానికి వంద నోట్లు ఉన్నాయంటే అది చిన్న విషయం కాదని జనం కూడా మండిపడుతున్నారు. నల్లాల్ అనే ఈ వైద్యుడు మొత్తం నగదు అంతటినీ కట్టలుగా కట్టి తన కారులో పెడుతుండగా అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి.. పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర మొత్తం రూ. 69.86 లక్షల విలువైన వంద నోట్లు లభ్యమయ్యాయి. వ్యాపారవేత్త అయిన తన స్నేహితుడు ఆ డబ్బు తనకిచ్చాడని, తాను రాజౌరి గార్డెన్లోని అతడి ఇంటికి ఆ సొమ్ము తీసుకెళ్తున్నానని వైద్యుడు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. వారు దర్యాప్తు చేస్తున్నారు. 73 లక్షల పాతనోట్లు స్వాధీనం మరోవైపు మహారాష్ట్రలో రెండు కార్ల నుంచి ఇప్పటికే రద్దుచేసిన 1000, 500 రూపాయల నోట్లతో కూడిన 73 లక్షల రూపాయలను పట్టుకున్నారు. నాసిక్-ఔరంగాబాద్ రోడ్డులో పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. అంతలో నాసిక్ నుంచి కోపర్గావ్ వైపు వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా.. రూ. 32,99,500 దొరికాయి. గుజరాత్ నుంచి మహారాష్ట్రలోని వైజాపూర్ వైపు వెళ్తున్న మరో కారును కూడా ఆపి తనిఖీ చేయగా.. అందులో మరో రూ. 40 లక్షలు కూడా దొరికాయి. ఈ విషయమై పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందంచారు. ఒక బ్యాంకు మేనేజర్ను కౌంటింగ్ మిషన్తో సహా పిలిచి డబ్బు లెక్కపెట్టించారు.