భూమ్మీద నూకలు మిగిలి ఉంటే..
ఆమె ఓ వైద్యురాలు. వయసు దాదాపు 27 సంవత్సరాలు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ.. గుర్‌గావ్‌లోని మెట్రోస్టేషన్‌లో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అప్పటివరకు ప్లాట్‌ఫాం మీద అటూ ఇటూ నడుస్తూ ఉన్న ఆమె.. రైలు రాగానే ఒక్కసారిగా దాని ముందు పట్టాల మీదకు దూకారు. ఆమె చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది. అయితే భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉండటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం సమయంలో గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరగడంతో దాదాపు పది నిమిషాల పాటు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.
అది ఆత్మహత్యా ప్రయత్నం కాదని రైల్వే అధికారులు అంటున్నారు గానీ, సీసీ టీవీ ఫుటేజి చూస్తే మాత్రం ఆమె సరిగ్గా రైలు వచ్చే సమయానికే పట్టాల మీదకు దూకినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకు పలు ఫ్రాక్చర్లు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే.. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి మాత్రం ఇంకా ఆమె ఆరోగ్యం సహకరించడం లేదని, ఆమె కోలుకోగానే ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు అంటున్నారు.