న్యూఢిల్లీ: ‘మతములన్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్నారు మహాకవి గురజాడ. మత, ప్రాంత భేదాలన్నీ మాసిపోయి.. మానవత్వమొక్కటే నిలబడుతుందని రుజువు చేశారో ఢిల్లీ డాక్టర్. ఉచితంగా వైద్యమందించి మెడ వంకరతో ఏళ్లుగా బాధపడుతున్న పాక్ బాలికను మామూలు మనిషిని చేశారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన అఫ్షీన్ గుల్ వయసిప్పుడు 12 ఏళ్లు. బాలిక పది నెలల చిన్నారిగా ఉన్నసమయంలో తన అక్క చేతుల్లోంచి జారిపడిపోయింది. అంతే మెడ 90 డిగ్రీలు వంగిపోయింది. అక్కడ డాక్టర్లకు చూపిస్తే మందులిచ్చారు. కానీ మెడ సెట్ కాలేదు. మెడ వంకరకు సెరిబ్రల్ పాల్సీ కూడా తోడవడంతో అఫ్షీన్ జీవితం నిత్య నరకమైంది. ఆడుకోలేదు. చదువుకోనూ లేదు. స్నేహితులు లేరు. అవన్నీ కాదు... అసలు తినడం, నడవడం, మాట్లాడటమే కష్టమైంది.
బ్రిటిష్ జర్నలిస్టు అలెగ్జాండ్రియా థామస్ అఫ్షీన్ వ్యథను రిపోర్ట్ చేసింది. అది ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్‌కు తెలిసింది. జర్నలిస్టు ద్వారా కుటుంబంతో మాట్లాడిన డాక్టర్... అఫ్షీన్‌ను మామూలు మనిషిని చేస్తానని మాటిచ్చారు. అలా 2021 నవంబర్‌లో బాలికను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఉచిత వైద్యమందించారు. నాలుగు అతిపెద్ద సర్జరీలను పైసా తీసుకోకుండా చేశారు. ఇప్పుడా బాలిక నవ్వుతోంది, మాట్లాడగలుగుతోంది. మామూలు మనిషైపోయింది. డాక్టర్ సర్జరీలు చేసి చేతులు దులుపుకోలేదు. ఇప్పటికీ స్కైప్‌లో బాలిక పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్‌ను కదిలిస్తున్న వీడియో చూశారా?
Comments
Please login to add a commentAdd a comment