రాహుల్ మీటింగులో మంచాలు ఫ్రీనా?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమావేశం నిర్వహించారు. చాలామంది జనం వచ్చారు. అంతవరకు బాగానే ఉంది.. జనం కూర్చోడానికి మామూలుగా అయితే ఫైబర్ కుర్చీలు వేస్తారు. కానీ రాహుల్ సభ కదా కాస్త గ్రాండ్‌గా ఉండాలని నులక మంచాలు వేశారు. సభ ఇలా ముగిసిందో.. లేదో, జనమంతా ఆ మంచాలు తీసుకుని పరుగులు తీశారు. రుద్రపూర్ జిల్లాలోని దేవరియాలో జరిగిన రాహుల్ సభ కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వెయ్యి మంచాలు ఏర్పాటుచేశారు. వాటిని జనానికి పంచిపెట్టేందుకే తెచ్చారా.. కాదా అనే విషయమై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు.
ఈ వ్యవహారం కాస్తా నెటిజన్లకు మంచి పండగలా మారింది. దేవరియా తర్వాత కుషీనగర్‌లో మరో ఖాత్ సభ నిర్వహించనున్నారు. దాంతో అక్కడ కూడా మళ్లీ మంచాలు వేస్తారా.. వాటిని తీసుకెళ్లచ్చా అంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. 'రీప్లేస్ మూవీనేమ్స్ విత్ ఖాత్స్' అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండవుతోంది. గ్రామస్తులు మంచాలు తీసుకెళ్తున్న ఫొటోలను కూడా జనం షేర్ చేస్తున్నారు.